‘రైతు భరోసా’ వివరాలు సరిచేసుకోవాలి
-మండల వ్యవసాయ అధికారి అనురాధ రెడ్డి
మొయినాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వానాకాలం2026 సీజన్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతులు తమ వివరాలను సరిచేసుకోవాలని మొయినాబాద్ మండల వ్యవసాయ అధికారి అనురాధ రెడ్డి సూచించారు.
ఆమె మాట్లాడుతూ, 2026 జూన్ 15 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్లో నమోదైన భూ యజమానులు, అలాగే అటవీ హక్కుల పత్రం (ROFR) కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. సాగుకు అనుకూలమైన (Arable) భూములు కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని, సాగుకు అనుకూలం కాని భూములు, అసంపూర్ణ భూ రికార్డులు లేదా బ్యాంకు వివరాలు ఉన్న వారు పథకానికి అనర్హులని స్పష్టం చేశారు.
రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్లు లేదా ఇతర సమాచారంలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సంప్రదించి సరిచేయించుకోవాలని సూచించారు. అర్హులైన రైతులందరూ జూలై 5 లోపు తమ వివరాలను సంబంధిత ఏఈవోల ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.






