27 June, 2026 | 3:47 AM

తోటి స్నేహితుడి కుటుంబానికి రూ. 60 వేల ఆర్థిక సాయం

27-06-2026 02:22 AM

మునుగోడు, జూన్ 26: అనారోగ్యంతో మృతి చెందిన తమ చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలుస్తూ కొంపల్లి గ్రామానికి చెందిన మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గుంటోజు వేణుగోపాల చారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు కలిసి సహాయం చేయాలని నిర్ణయించారు.

కొంపల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులు తమకు తోచినంత మేర విరాళాలు సేకరించి మొత్తం రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని వేణుగోపాల చారి కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. చిన్ననాటి స్నేహితులు చూపిన ఈ మానవత్వం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో పగిళ్ల అయోధ్య, వీరమల్ల సత్తయ్య, సిలువేరు ప్రవీణ్, దాం నాగరాజు, సూర శంకరయ్య, తాటికొండ కృష్ణయ్య, పోలగోని లింగస్వామి పాల్గొన్నారు.