14 March, 2026 | 3:01 AM

గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో పుకార్లు

14-03-2026 01:37 AM

గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు దీరిన వినియోగదారులు

ఏజెన్సీనీ తనిఖీ చేసి కొరత లేదని వెల్లడించిన కలెక్టర్

ఆదిలాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): పశ్చిమషియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత నెలకొంటుందంటు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఆదిలాబాద్ లోని హెచ్.పీ విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. దీంతో ఏజెన్సీ వద్ద సందడి నెలకొంది.

అటు వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని ఏజెన్సీ నిర్వాహకులు సతీష్ వినియోగదారులకు సూచించారు. మరోవైపు ప్రజలు గ్యాస్ ఏజెన్సీ ల వద్ద వినియోగదారులు బారులు తీరిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా తక్షణమే స్పందించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్‌ఓ నందిని, తాహసిల్దార్ శ్రీనివాస్, ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మహేష్ లతో కలసి గ్యాస్ ఏజెన్సీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సిలిండర్ల స్టాక్ వివరా లు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ల కొరత పై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మ వద్దని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలెండర్‌లను అందజేసే లా చర్యలు చేపడుతున్నామన్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800-425-1939 టోల్ ఫ్రీ  నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు.