31 March, 2026 | 8:42 PM

రోడ్డు భద్రత చర్యలు తప్పనిసరిగా పాటించాలి

31-03-2026 07:00 PM

- పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాల్

గజ్వేల్: వాహనదారులు తప్పనిసరిగా వాహన ప్రయాణంలో రోడ్డు భద్రత చర్యలు పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్ అన్నారు. ములుగు మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఆర్.వి.ఎం మెడికల్ కళాశాలలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను కోల్పోవద్దని కోరారు. యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, ఒకసారి తప్పుడు మార్గంలో వెళ్తే కెరీర్‌తో పాటు జీవితమే దెబ్బతింటుందని తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు పరస్పరం స్నేహభావంతో మెలగాలని సూచించారు.

వైద్య వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడటం సరైన పరిష్కారం కాదని హితవు పలికారు. ఏవైనా సమస్యలు ఎదురైతే సీనియర్లు లేదా అధ్యాపకులను సంప్రదించి చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ హాస్పిటల్‌లోని సీసీటీవీ మానిటరింగ్ వ్యవస్థను పరిశీలించారు. భద్రతా పరంగా నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, ములుగు ఎస్ఐ రఘుపతి, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.