ములుగు జిల్లాను అభివృద్ధి వెలుగులతో విరాజిల్లేలా కృషి చేయాలి
- ఆరు నెలల్లో రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి.
- అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- మంత్రి సీతక్క
ములుగు,(విజయక్రాంతి): వెనుకబడిన ములుగు జిల్లాను అభివృద్ధి వెలుగులతో విరాజిల్లేలా అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. గురువారం ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల, రహదారులు–భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటిసరఫరా, జాతీయ రహదారులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, తెలంగాణ వైద్య సేవలు–మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, విద్యా–సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులను శాఖలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులను గుర్తించి, సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు.
సమీక్ష సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రామప్ప– లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిరంతరం రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సూచించారు. రామప్ప సరస్సు నుంచి ములుగు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలను రూపొందించాలన్నారు.
మేడారం జాతర ప్రాంతంలో జంపన్నవాగు సుందరీకరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. మేడారంలో నూతనంగా నిర్మించనున్న అతిథిగృహాన్ని రెడ్డిగూడెం ప్రాంతంలోని గుట్టపై నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. మేడారం రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర ఘాట్ వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
మల్లూరు ప్రాంతంలో నూతన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల, నర్సింగ్ కళాశాలతోపాటు జిల్లాలో కొనసాగుతున్న ఇతర భవన నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గోదావరి జలాలు ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు తరలిపోతున్నప్పటికీ, స్థానికంగా సాగునీటి సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు 200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
నీటిపారుదల శాఖ పరిధిలో అవసరమైన ఘాట్ల నిర్మాణంతోపాటు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించినట్లు వెల్లడించారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






