ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం
సినీ నటుడు భరత్‌కాంత్, కెమెరామన్ త్రిలోక్ దుర్మరణం
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్ (31), కెమెరామన్ త్రిలోక్ (31) దుర్మరణం చెందారు. ఏపీలోని నెల్లూరు పట్టణానికి చెందిన కత్తి మోహనరావు, జయలక్ష్మి దంపతుల కుమారుడు భరత్ కాంత్, అదే ప్రాంతా నికి చెందిన గూడా మాల్యాద్రి శర్మ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు త్రిలోక్ పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. నానక్‌రాంగూడలో ఉంటున్నారు.
భరత్ కాంత్ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలతోపాటు టెనెంట్ సినిమాలో హీరోగా నటించాడు. త్రిలోక్ కెమెరామన్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం నెల్లూరుకు వెళ్లిన వీరు శనివారం రాత్రి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందారు.






