26 August, 2026 | 4:09 AM

రైస్ మిల్లర్లకు అరెస్టుల గుబులు!?

26-08-2026 12:00 AM
  1. ఉమ్మడి జిల్లాలో నలుగురు వ్యాపారుల అరెస్టు, రిమాండ్ 
  2. సీఎంఆర్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా

కామారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని తిరిగి సీఎంఆర్ అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు కోట్ల రూపాయల ధాన్యాన్ని కొల్లగొట్టి చేతులెత్తేసిన విషయం ఉమ్మడి జిల్లాలో తెలిసిన విషయమే. సుమారు 200 కోట్ల సీఎం ఆర్ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన రైస్ మిల్లర్ ల పై ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఉమ్మడి జిల్లాలో 62 మంది రైస్ మిల్లర్లు సుమారు 200 కోట్ల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా స్వాహా చేశారు. వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని ఎన్నోసార్లు రైస్ మిల్లర్లను సివిల్ సప్లై అధికారులు నోటీసులు పంపి నా స్పందించలేదు. ఆర్‌ఆర్ యాక్ట్ ఉపయోగించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన కూడా రైస్ మిల్లర్లు స్పందించలేదు. కామారెడ్డి జిల్లాలో కొంతమంది రైస్ మిల్లర్ లు స్పందించి ఆగస్టు నెలలోనే రూ. 70 కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించారు.

మరి కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు పూనుకుంటుంది. కామారెడ్డి జిల్లాలోని గుణందర్, బల్వంతరావు  రైస్ మిల్ వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి మండలానికి చెందిన మరో ఇద్దరు రైస్ మిల్లర్ వ్యాపారులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఉమ్మడి జిల్లాలో 200 కోట్లకు పైగా సీఎంఆర్ రైస్ బకాయిలు ఉండడంతో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది.

ఎన్నో సంవత్సరాలు అవకాశం ఇచ్చిన రైస్ మిల్లర్లు స్పందించకపోవడంతో అరెస్టుల పర్వానికి శ్రీకారం చుట్టారు. బకాయి పడిన రైస్ మిల్లర్లకు అరెస్టుల సెగ పట్టుకుంది. అధికారుల ఉదాసీనత వల్లే రైస్ మిల్ వ్యాపారులు కోట్ల రూపాయల ధాన్యాన్ని కొల్లగొట్టారని ప్రభుత్వానికి ఇంటిలిజెంట్ నివేదిక వెళ్ళింది. ప్రస్తుతం రైస్ మిల్ వ్యాపారులపై చర్యలు తీసుకున్న తర్వాత అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదాసిన గా వ్యవహరించిన అధికారుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించినట్లు సమాచారం. 

మరి కొంతమంది రైస్ మిల్లర్లా అరెస్టుకు రంగం సిద్ధం

ఉమ్మడి జిల్లాలో సిఎంఆర్ కొల్లగొట్టిన రైస్ మిల్ల్ప చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరి కొంతమందిని అరెస్టు చేసి జైలుకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో రైస్ మిల్ వ్యాపారు లలో ఆందోళన వ్యక్తమౌతుంది. కుటుంబ సమేతంగా షూరిటీ ఉండడంవల్ల అరెస్ట్ చేస్తే కుటుంబం మొత్తం జైలు పాలు కావాల్సి వస్తుందని అధికారులు నచ్చజెప్పి ప్రయత్నం చేస్తున్నారు.

బకాయిలను చెల్లించాలని లేకుంటే కుటుంబం మొత్తం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్ వ్యాపారులను పిలిచి హెచ్చరికలు సైతం జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే అరెస్టులు చేస్తామని అప్పటిలోగా బకాయిలను చెల్లించాలని రైస్ మిల్లర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్లక్ష్యం చేస్తున్న  వ్యాపారు లను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో రైస్ మిల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

అందరికీ నోటీసులు పంపాము 

కామారెడ్డి జిల్లాలో 100 కోట్ల కు పైగా సీఎంఆర్ రైస్ నో రైస్ మిల్లర్లు అప్పగించాల్సిందే. లేకుంటే అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని బకాయి ఉన్న రైస్ మిల్లర్లకు ఇప్పటికే నోటీసులు అందజేశాం. మరోసారి అవగాహన సదస్సు పెట్టి నచ్చచెప్పాం. కొంతమంది ముందుకు వచ్చి  బకాయిలను చెల్లిస్తున్నారు. బకాయిలు చెల్లించని వారిని అరెస్టు చేయక తప్పదు.

- వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి