13 July, 2026 | 1:59 AM

బీఎల్‌ఓల పనితీరుపై సమీక్ష

13-07-2026 01:07 AM

గడువులోపు ఫారాలు సమర్పించాలి

దోమకొండ, జూలై 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆదివారం గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి, జీపీఓ అశోక్, వార్డు సభ్యుడు పాల మల్లేశం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి బీఎల్‌ఓల పనితీరును తనిఖీ చేయడంతో పాటు ఎన్యుమరేషన్ ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, పేరు మార్పులు, చిరునామా సవరణలు, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియపై బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు.

అర్హత ఉన్న ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌ఓలకు సమర్పించాలని అధికారులు కోరారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే బీఎల్‌ఓలు అక్కడికక్కడే నివృత్తి చేసి అవసరమైన సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రతి అర్హ ఓటరు గడువులోపు ఇన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.