22 March, 2026 | 7:43 PM

ఒక్కో జిల్లా.. ఒక్కో పంటకు ప్రసిద్ధి: సీఎం రేవంత్

22-03-2026 05:55 PM

హైదరాబాద్: ప్రజా పాలన-రైతు ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో పర్యటించారు. అనంతరం నంగనూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించి, 62 ఎకరాలపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ కార్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చారు. అలాగే నర్మెటలో రూ.80 కోట్లతో నిర్మించే వంటనూనె రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో వెనుకంజ వేయటం లేదని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, రైతుభరోసా నిధులను మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని, 45 రోజుల్లో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేయనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతేకాకుండా రైతుభరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాలకు తొలి విడతగా రూ.3,600 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఇవాళ ఆదివారం బ్యాంకులకు సెలవు కావండంతో రైతుల ఖాతాల్లో రేపు రైతుభరోసా డబ్బులు జమకానున్నాయని, మిగతా నిధులు రెండు విడతల్లో విడుదల చేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణమాఫీ కూడా చేశాం, వరికి బోనస్ ఇస్తున్నాం, వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశామని, తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేదని సీఎం  తెలిపారు.

రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలని, గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గిందని, కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోందని, పంటమార్పిడి ద్వారా మాత్రమే వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు. 

సిద్ధిపేటలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ కొడంగల్ లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని రైతులంతా ముందుకెళ్లాలని, తెలంగాణలో ఒక్కో జిల్లా, ఒక్కో పంటకు ప్రసిద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయని, కష్టపడే రైతులు ఉన్నారని, మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు.