మోసపోయేది విద్యాధికులే..
సైబర్ ‘వల’కు చిక్కిన రిటైర్డ్ టీచర్
రూ.82.40 లక్షలకు కుచ్చు టోపీ
మహబూబాబాద్, మే 7 (విజయక్రాంతి): మోసాలకు గురికాకుండా కాపాడవలసిన విద్యాధికులే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. 100 కాదు వెయ్యి కాదు.. ఏకంగా లక్షల్లో నగదు పోగొట్టుకొని ఆ తర్వాత గొల్లుమంటున్నారు. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా, చేయని తప్పుకు బలవుతున్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే భయపడవద్దని, డిజిటల్ అరెస్టులు ఉండవని, నగదు బదిలీలు అసలే అడగరని ఓవైపు ప్రభుత్వం, బ్యాంకులు, పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, మరోవైపు విద్యాధికులే సైబర్ నేరాలకు చిక్కి తరచుగా మోసపోతున్నారు. ఇదే క్రమంలో గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తాజాగా సైబర్ వలలో చిక్కుకొని ఏకంగా 82 లక్షల 40 వేల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది.
గత నెల 11న ఆ ఉపాధ్యాయుడికి వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ రావడంతో అతని భార్య లిప్ట్ చేసింది. ఉపాధ్యాయుడి ఆధార్ కార్డు నంబర్ పై 17 వేదింపు కేసులు నమోదు చేయడం జరిగిందని, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. తరువాత వాట్సాప్ వీడియో కాల్ చేస్తామని చెప్పి అవతలి వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉండి మీ బ్యాంకు ఖాతాలో అంతర్జాతీయ నేరగాడు 75 లక్షలు వేశాడని, మీ మీద అరెస్టు వారెంట్ జారీ అయిందని, మళ్లీ ఇంకో అధికారి లైన్లోకి వచ్చి డబ్బులు పూర్తిగా చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటూ హెచ్చరించారు.
దీనితో భయపడ్డ ఆ టీచర్ తన వద్ద ఉన్న 20 లక్షల రూపాయలతో పాటు ఫికస్డ్ డిపాజిట్ డబ్బులు 19 లక్షలు, ఆయన భార్య ఖాతాలో ఉన్న రెండు లక్షలు, ఆయన భార్య పేరుతో ఉన్న ఫికస్డ్ డిపాజిట్ డబ్బులు తొమ్మిది లక్షలు, బంగారంపై లోను తీసుకుని 18 లక్షలు, ఎల్‌ఐసిలో లోన్ తీసుకొని 12 లక్షలు కలిపి, నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు ఏప్రిల్ 15న 49 లక్షలు, 18న 22 లక్షల 20వేలు, 22న 11 లక్షల ఇరవై వేల రూపాయలు ఆర్టిజిఎస్ ద్వారా జమ చేశారు.
ఆ తర్వాత ఈనెల కేటుగాళ్లు సదరు ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి ఈనెల 2న మీరు చెల్లించిన డబ్బులు జమ అయ్యాయని, విచారణ పూర్తికాగానే మీ డబ్బులు మీకు జమ చేస్తామని ఆ దంపతులను నమ్మించారు. తీరా మూడో తేదీన బాధితులు కేటుగాళ్ల నుండి వచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేయడంతో సమాధానం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సూచన మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై మహబూబాబాద్ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి చైతన్యవంతులను చేసిన విద్యాధికులే సైబర్ నేరాల బారిన పడటం మానుకోట పట్టణంలో సంచలనం సృష్టించింది.
ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
పోలీస్ లేదా సీబీఐ ఎప్పుడూ వీడియో కాల్లో ‘అరెస్ట్’ చేయరు. ఎవ్వరూ బ్యాంక్ డబ్బులు ‘వెరిఫికేషన్’ కోసం ట్రాన్స్ఫర్ చేయమని అడగరు. కోర్టు ఆర్డర్లు వాట్సాప్ లో పంపరు. భయపెట్టే కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేయాలి. కుటుంబ సభ్యులు లేదా స్థానిక పోలీసులతో మాట్లాడాలి. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలి.
మోసగాళ్లు ఎక్కువగా ఉపయోగించే పద్ధతులు:
వాట్సప్ వీడియో కాల్స్
నకిలీ పోలీస్ యూనిఫాములు
ఫేక్ కోర్టు ఆర్డర్లు
స్క్రీన్ షేరింగ్ ఓటీపీలు అడగడం
‘సీక్రెట్ ఇన్వెస్టిగేషన్’ అంటూ కుటుంబానికి చెప్పొద్దని హెచ్చరించడం
డబ్బులు ‘సేఫ్ అకౌంట్’లో పెట్టమని చెప్పడం






