15 June, 2026 | 10:35 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్

15-06-2026 09:15 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, బడిబాట కార్యక్రమం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, ఆధార్ అప్‌డేషన్, అపార్ నమోదు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం కింద జిల్లాకు నిర్దేశించిన 60,415 మంది విద్యార్థుల చేరికల లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో, పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. బడిబాట కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు.

జిల్లాలో ప్రస్తుతం జీరో ఎన్‌రోల్మెంట్ ఉన్న 10 ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత ఎంఈఓలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఆయా పాఠశాలల్లో తిరిగి విద్యార్థుల చేరికలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలు) ఎంఈఓలు క్రమం తప్పకుండా సందర్శించి, చేరికల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. అలాగే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి విద్యార్థులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపునకు ఎం ఈ ఓ  లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో బోధన, హాజరు, విద్యార్థుల అభ్యాస స్థాయిలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను విద్యా రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.