23-02-2026 02:10:27 AM
సుప్రీంకోర్టు వ్యాఖ్యలే.. రెరా బలోపేతానికి మార్గదర్శకాలు..
చట్టం సరే.. కఠినంగా అమలు చేస్తేనే ప్రయోజనం
చట్టంలోని అధికారాలను అధికారులు
ఉపయోగించాలని నిపుణుల సూచనలు
వినియోగదారుల రక్షణకు రెరా కాపలాదారుగా మారాలి
హైదరాబాద్, ఫిబ్రవరి ౨౨ (విజయక్రాంతి): దేశంలోని రియల్ ఎస్టేట్ రంగాన్ని పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నడిపించేందుకు ఏర్పాటు చేసిన రెరా (ఆర్‌ఈఆర్ ఏ) అమలవుతున్న విధానంపై.. ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేయనున్నాయి. చట్టం బలహీనమా కాదా అన్నదానికన్నా, ఆ చట్టం ఎంత కఠినంగా అమలవుతోందన్నదే అసలు ప్రశ్నగా నిలుస్తోంది.
రెరా తన అధికారాల అస్త్రాలను ప్రయోగించేలా ప్రక్షాళించుకంటేనే, ఆ సంస్థ వినియోగదారుల రక్షణకు వెన్నుదన్నుగా నిలుస్తుందని సర్వత్రా వ్యక్తమవుతోంది. అనేక రాష్ట్రాల్లోని రెరాల పనితీరును గురువారం సుప్రీంకోర్టు పరిశీలిస్తూ.. తీవ్రంగా విమర్శించింది. ‘డిఫాల్ట్ చేస్తున్న బిల్డర్లకు సహకరించడం తప్ప మరేమీ చేయడం లేదంటూ’ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవసరమైతే “ఈ సంస్థ ను రద్దు చేయడం మంచిదేమో” అని కూడా ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కేవలం విమర్శ కాదు.. చట్టం అమలులో ఉన్న లోపాలపై తీవ్రమైన హెచ్చరికలాంటిదే.
సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అనరాక్ చైర్‌పర్సన్ అనుజ్‌పురి మాట్లాడుతూ.. రెరా అమలు కఠినతరం అయితే, ప్రాజెక్ట్ టైంలైన్, ఎస్క్రో ఖాతాల పర్యవేక్షణ మరింతగా బలపడే అవకాశం ఉంది. కేసుల విషయానికి వస్తే.. పెండింగ్ తగ్గి, నియంత్రణ వ్యవస్థ అనేది కాగితాలపై కాకుండా.. క్షేత్రస్థాయిలో పనిచేసే దిశగా అడుగులు పడవచ్చు. అయితే దీనివల్ల చిన్న, నిబంధనలు పాటించని డెవలపర్లపై ఒత్తిడి పెరగడం సహజం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక సామర్థ్యం, మంచి గవర్నెన్స్ కలిగిన సంస్థలకు ఇది అనుకూల వాతావరణాన్ని కల్గిస్తుందని చెప్పుకొచ్చారు.
సాయా గ్రూప్ ఎండీ వికాస్ భాసిన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు (ఎస్సీ) వ్యాఖ్యలు నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రేరణగా మారవచ్చు. సానుకూల, ప్రాయోగిక సవరణలతోపాటు ఏకరీతిగా అమలు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి బాధ్యతాయుత వృద్ధిని ప్రోత్సహిస్తాయి అని చెప్పుకొచ్చారు. అశ్విన్ సేథ్ గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవిక్ భండారి మాట్లాడుతూ.. డెవలపర్లకు ఈ మార్పు గవర్నెన్స్, మూలధన క్రమశిక్షణతోపాటు సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేయడంపై దష్టి సారించేలా ప్రభావం చూపుతుందని అన్నారు.
కఠినంగా అమలు, పారదర్శకతే లక్ష్యం కావాలి
ఎనిమిదేళ్ల క్రితం అమలులోకి వచ్చిన రెరా చట్టం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99,203 ప్రాజెక్టులు, అలాగే 1,12,051 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదయ్యారని గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోనే మహారాష్ట్రలో, అటు తరువాత గుజరాత్‌లో అత్యధికంగా ప్రాజెక్టులు నమోదు కావడం ఈ చట్టం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది. కానీ సంఖ్య పెరగడం ఒక్కటే చట్టం పకడ్బందీగా అమలవుతున్నదనడానికి సూచిక కాదు..
కఠినంగా అమలు చేయడం, పారదర్శకత అనేవే అసలు ప్రమాణాలు. ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ అధ్యక్షుడు, రెరా కేంద్ర సలహా మండలి సభ్యుడు అయిన అభయ్ ఉపాధ్యాయ్ దీనిపై మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రెరా చట్టాన్ని కాకుండా, దాని అమలు విధానాన్ని, సంస్థ పనితీరును విమర్శించిందని అన్నారు. ‘సమస్య అమలులో ఉంది. అధికారాలు తమను తాము అసహాయులమని చెప్పలేరు.
చట్టంలో వారికి అధికారాలు ఉన్నాయి. కానీ- వాటిని ఉపయోగించాలి అంటూ ఆయన ముక్తాయింపునిచ్చారు. ప్రిమస్ పార్ట్‌నర్స్ ఇండియా ఫౌండర్, ఎండీ ఆర్తి హర్భజాంకా వెల్లడించిన అభిప్రాయం ప్రకారం.. రెరా ప్రాథమిక ఉద్దేశాన్ని పునఃపరిశీలించడం కంటే, దాని అమలును బలోపేతం చేసి సులభతరం చేయడంపై దష్టి పెట్టాలి అన్నారు.
‘రెరా రిజిస్టర్డ్’ నిజమైన నమ్మకానికి సంకేతంగా ఉండాలి
నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమస్య చట్టంలో కాదు; అమలు వ్యవస్థలో ఉంది. అధికారులకు చట్టపరమైన అధికారాలు ఉన్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. రూ.10 వేలు, రూ.15 వేల స్వల్ప జరిమానాలు విధించడం వల్ల నియమాల ఉల్లంఘనను తేలికగా తీసుకుంటున్నారు. ‘రెరా -రిజిస్టర్డ్’ అనే పదం మార్కెటింగ్ సాధనంగా మారకూడదు.. అది నిజమైన నమ్మకానికి సంకేతంగా ఉండాలి.
ఇప్పటికైనా బాధ్యతను గుర్తించి, సమర్థమైన పర్యవేక్షణ, కఠిన చర్యలు, సమయపాలనతో కూడిన విచారణ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే రెరా అసలు లక్ష్యం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకం పెంపొందించాలంటే చట్టం బలంగా ఉండటం సరిపోదు.. అది కఠినంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు విమర్శలుగానే కాకుండా.. సంస్కరణలకు దారితీసే మార్గదర్శకాలుగా పరిగణిస్తే.. రెరా నిజంగా వినియోగదారుల రక్షణకు కాపలాదారుగా నిలుస్తుంది. లేకపోతే అది కేవలం పేరుకు ఒక సంస్థగా మిగిలిపోతుంది.