11 June, 2026 | 3:07 PM

సుప్రీంకోర్టుకు మీనాక్షి నటరాజన్.. రేపు విచారణ

11-06-2026 01:47 PM

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan petition) గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ ను ఆర్ వో తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది. మీనాక్షి పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జూన్ 18న జరగనున్నాయి. అఫిడవిట్‌లో సమాచారాన్ని దాచిపెట్టారనే ఆరోపణలపై మంగళవారం మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించడంతో పరిణామాలు నాటకీయ మలుపు తీసుకున్నాయి. 

రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం, అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన తర్వాత, నటరాజన్ తన నామినేషన్‌తో పాటు సమర్పించిన 'ఫారం 26'లో ఒక కోర్టు ఫిర్యాదు వివరాలను పేర్కొనకుండా అసంపూర్ణ అఫిడవిట్‌ను సమర్పించినట్లు తేలింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో తనపై నమోదైన ఒక కేసు గురించి నటరాజన్ తన అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఆరోపిస్తూ, అధికార బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ, మంగళవారం నాడు పత్రాల పరిశీలన ప్రారంభమైంది.