ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత
జైపూర్: రాజస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత మాండ్ గాయని గావ్రీ దేవి(Mand folk singer Gavri Devi dies) కన్నుమూశారు. గావ్రీ దేవి 98 ఏళ్ల వయసులో పాలిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గావ్రీ దేవి దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా మాండ్ గాన రంగంలో చురుకుగా ఉంటూ, తన ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం సర్వోదయ నగర్‌లోని మోక్ష ధామ్‌లో జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.
గావ్రీ దేవి మాండ్ గాన వారసత్వాన్ని తన కోడలు సుందర్‌దేవికి, మనవరాలు నీతూకు అప్పగించారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఒక కోడలుతో సహా 30 మంది సభ్యుల కుటుంబం ఉంది. గావ్రీ దేవి బార్మర్ జిల్లాలోని కోరన్ గ్రామంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వృత్తిపరమైన జానపద కళాకారులు, వారి నుండే ఆమె మాండ్ గానంలోని మెళకువలను నేర్చుకున్నారు. పాలిలో, ఆమె పేరు మీద ఉన్న గావ్రీ నగర్‌లో ఆమె ఇల్లు ఉంది. తన గాన వృత్తి జీవితంలో, గావ్రీ దేవి తన భర్త మిశ్రిలాల్ రావుతో కలిసి దేశవ్యాప్తంగా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. వారి కార్యక్రమాలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడ్డాయి. ఆమె తన జీవితకాలంలో జవహర్ కళా కేంద్ర, దూరదర్శన్, వీర్ దుర్గాదాస్ రాథోర్ జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్నారు.
గావ్రీ దేవి మృతి పట్ల కేంద్ర కళలు, సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ నివాళులర్పించారు. దేశంలో, ప్రపంచంలో రాజస్థాన్ మాండ్ గానానికి ఒక ప్రత్యేక గుర్తింపును అందించడంలో అమూల్యమైన కృషి చేసిన ప్రఖ్యాత జానపద గాయని, పూజ్య గవరి దేవి మరణ వార్త కళా ప్రపంచానికి అత్యంత విచారకరమైనదని పేర్కొన్నారు. ఆమె తన జీవితంలోని ప్రతి క్షణాన్ని జానపద కళ, జానపద సంగీత పరిరక్షణకు, ప్రోత్సాహానికి అంకితం చేశారని షెఖావత్ తెలిపారు. ఆమె గాత్ర సాధన రాజస్థాన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. ఒక సాంస్కృతిక కార్యకర్తగా ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని స్పష్టం చేశారు.






