ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి
రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాను సవరించాలని...మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు విన్నవించిన బిల్డర్లు
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
త్వరలోనే సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని హామీ
మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించాలని బిల్డర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను అభ్యర్థించారు. గత రెండు వారాల కిందట నుంచి ఉప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో ప్రైవేటు భూములు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదని కలెక్టర్ మను చౌదరి ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఏవీ కన్ స్ట్రక్షన్స్ ఎండీ, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఉప్పల్ బిల్డర్స్ అసోసియోషన్ అధ్యక్షులు ఆకుల సత్యనారయణ ఆధ్వర్యంలో సోమవారం బోడుప్పల్, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్స్ పరిధిలోని రియాల్టర్లు, బిల్డర్లు, బయ్యర్లు, వివిధ కాలనీల ప్రతినిధులు అంతాయిపల్లిలోని కలెక్టర్ కార్యాయలంలో మేడ్చల్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా కలిసి రిజిస్ట్రేషన్ల సమస్యలపై మొరపెట్టుకున్నారు.
ఒక సర్వే నెంబర్‌లోని కొంత విస్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పటికీ ఆ సర్వే నెంబర్‌లోని మొత్తం భూ విస్తీర్ణంను 22-ఏ లో చేర్చడం వలన పట్టాదారులు, రియాల్టర్లు, బిల్డర్లు, బయ్యర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడుతూనే తమకు చెందిన ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
22-ఏను సవరించాలి...
ఇటీవల రూపొందించిన 22-ఏ జాబితాను పుఃన పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆ జాబితాను సవరించాలని కోరారు. ముఖ్యంగా మేడిపల్లి, ఘట్కేసర్, చుట్టుపక్కల రెవెన్యూ గ్రామాలలో ప్రైవేటు పట్టా భూములలోని లేఅవుట్‌లలోని ప్లాట్ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కలెక్టర్‌కు తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఎన్నో యేండ్ల కిందట లేఅవుట్‌లుగా అభివృద్ధి చేసిన ప్రైవేటు భూములలోని ప్లాట్లను కొత్తగా నిషేధిత ఆస్తుల జాబితాలో దర్శనమిస్తుండటంపై బిల్డర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో ప్లాట్ యజమానులు, బిల్డర్లు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆధారాలతో సహా కలెక్టర్‌కు వినితి పత్రం అందించారు. జక్క వెంకట్ రెడ్డి సారధ్యంలో కలిసిన బిల్డర్లు, రియాల్టర్లతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. సమస్య ఎక్కడెక్కడ ఉంది, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో చేర్చామని, సబ్ రిజిస్ట్రార్లతో త్వరలోనే సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని బిల్డర్లకు హామీ ఇచ్చారు.






