అటకెక్కిన రీయింబర్స్‌మెంట్ జీతాలకు కటకటే!
సిబ్బందికి 50 శాతం జీతాలే ఇస్తున్న ప్రైవేటు కాలేజీలు
కొన్ని కాలేజీల్లో 3 నుంచి 6 నెలలుగా జీతాలు పెండింగ్
భారం తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం విద్యార్థులపైనే కాదు.. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులపైన కూడా పడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో దీనిని సాకుగా చూపి ప్రైవేట్ కాలేజీలు కొన్ని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.
సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా కోత విధించడంతోపాటు, నెలల తరబడి జీతాలను పెండింగ్‌లో పెడుతున్నాయి. రూ. లక్షల్లో ఫీజులు వసూలుచేసే కాలేజీలు సైతం జీతాల్లో కోత విధించడమే కాదు.. సిబ్బందిని కూడా తగ్గించుకుంటున్నాయి. పైగా విద్యార్థుల నుంచి వసూలుచేస్తున్న ఫీజు ల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండడంలేదు. కానీ వీరికిచ్చే జీతాల్లో మాత్రం కోత పెడుతున్నారు.
4 వేలమంది సిబ్బంది తొలగింపు!
ఒకవైపు జీతాల్లో కోత విధిస్తూనే పలు కాలేజీలు మరోవైపు సిబ్బందిని తొలిగించుకునే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 25 వేల మంది అధ్యాపకులు ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది అధ్యాపకులను ఆయా కాలేజీలు తొలగించినట్లు తెలిసింది. అయితే కొన్ని కాలేజీలు భారం తగ్గించుకునేందుకు అధ్యాపకులను తొలగిస్తే.. మరికొన్ని కాలేజీల్లో జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో అధ్యాపకులే వెళ్లిపోతున్నారు.
అయితే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్టీయూ పలు కాలే జీల్లో ఇన్‌స్పెక్షన్ చేపట్టింది. ఇన్‌స్పెక్షన్ జరిగే వరకు సరిపడా అధ్యాపకులు తమ కాలేజీల్లో ఉన్నారని చూపించుకుని ఆ తర్వాత వారిని తొలగించేస్తున్నారు. దీంతో తూతూ మంత్రంగానే కాలేజీల్లో తనిఖీలు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కాలేజీల్లో సగం మంది వరకు సిబ్బందిని తగ్గించుకోవాలని కాలేజీలు అనుకుంటున్నాయి.
అప్పుడు కరోనా.. ఇప్పుడు రీయింబర్స్‌మెంట్..
కాలేజీలెప్పుడూ అధ్యాపకుల జీతాలు ఇవ్వడంలో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరోనా సమయంలోనూ కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకులకు సరిగా జీతాలు చెల్లించలేదు. అప్పట్లో కాలేజీ యాజమాన్యాలపై అధ్యాపకులు నిరసనలు, ధర్నాలు చేపడుతూ ఒత్తిడి తీసుకురావడంతో తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఆ జీతాలను ఇప్పటి వర కు చాలా కాలేజీలు ఇంకా చెల్లించనేలేదని టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సంతోష్ కుమార్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో తాము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని సాకుగా చెప్పుకుంటున్నాయి. దీంతో పిల్లల ఫీజులు, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీ ఖర్చులకు కూడా ఇబ్బంది కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ నుంచి సగం జీతమే..
రాష్ట్రంలో 157 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో దాదాపు 25 వేల మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫె సర్లు పనిచేస్తున్నారు. వీరిలోనూ ప్రొఫెసర్లు చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు. వీరంతా కలిపి 2 వేల మంది ఉంటే, అసోసియేట్ ప్రొఫెసర్లు 5 వేల వరకు, మిగిలిన 18 వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుంటారు. అయితే భారీగా ఫీజులు వసూలుచేసే టాప్ కాలేజీలు జీతా ల్లో కోత విధిస్తున్నాయి.
సగం జీతాలనే ఇస్తున్నారు. డిసెంబర్ నుంచి ఇలానే ఇస్తున్నాయని అధ్యాపక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక మీడియం, చిన్న కాలే జీలు మాత్రం దాదాపు ఐదారు నెలల నుంచి జీతాలను పెండింగ్‌లో ఉంచుతున్నాయి. జీతాలు తక్కువగా ఉన్న ఏవో కొన్ని కాలేజీ లు మాత్రం నెల రెండు నెలలకోసారి జీతాలను చెల్లిస్తున్నాయి.






