భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
ఆర్మూర్, మే 2 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో పోలీస్ స్టేషన్ ఆవరణలోని భవనంపై నుంచి యువతి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని కలతచెందింది. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి కుటుంబం అదే గ్రామానికి చెందిన సాయికుమార్ కుటుంబం గతంలో ఒకే ఇంట్లో పదేళ్లుగా అద్దెకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించు కున్నారు. రెండేళ్ల క్రితం యువతి కుటుంబీకులు ఇళ్లు మారారు. ఈ క్రమంలో సాయికు మార్‌కు పెద్దలు నిర్ణయించిన అమ్మాయితో వివాహం జరిగింది. అతను గల్ఫ్ వెళ్లిపోయా డు. రెండేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.
విషయం తెలుసుకున్న యువతి తనను పెళ్లి చేసుకోవాలని బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సాయికుమార్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. తనకు వివాహం జరిగిందని ఒక కుమారుడు ఉన్నాడని, సదరు అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని సాయికుమార్ పోలీసులకు తెలిపాడు. దీంతో యువతి మనస్థాపం చెంది పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. భవనంపైనుంచి దూకే సమయంలో యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. యువతిని హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి రుకుంబాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శైలేందర్ తెలిపారు.






