వంద రోజుల్లో 6 వేల కోట్లు
ఉద్యోగ జేఏసీ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీలు
- విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లిస్తాం
- అధికారుల కమిటీ నివేదిక అందిన తర్వాత పీఆర్సీపై నిర్ణయం
- తక్షణం నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం
- జూన్ 1 లోపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ ఆరోగ్య భద్రత కార్డు
- గుర్తింపు సంఘాలు 2 నెలలకోసారి నివేదిక ఇవ్వండి
- ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో భేటీ
- హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు చామల, వేం నరేందర్‌రెడ్డి
* ప్రజా ప్రభుత్వం వచ్చాక 67,760 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే వాతావరణం కల్పించాం. బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ప్రక్రియ పూర్తి చేశాం. పతి నెలా 1వ తేదీనే వేతనాలు అందజేస్తున్నాం.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): విశ్రాంత ఉద్యో గులకు సంబంధించిన రూ. 6 వేల కోట్ల రిటైర్‌మెంట్ బకాయిలను వందరోజుల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. పీఆర్సీపై తక్షణం రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ రిపోర్డు అందగానే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని భరోసానిచ్చారు. జూన్ 1లోపు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.
గుర్తింపు సంఘాలు రెండు నెలలకోసారి సమావేశమై తమ సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని, వాటికి పరిష్కారం లభించకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం తన నివాసంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో భేటీ అయ్యారు.
సీఎం ఈ సందర్భంగా నాలుగు అంశాలపై స్పష్టతనిచ్చారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కార్డుల ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చాక 67,760 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేశామని ఉద్ఘాటించారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని తెలిపారు.
ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బ దిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని, ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని కొనియా డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.వేల కోట్లు బిల్లులు పెండింగ్: డిప్యూటీ సీఎం భట్టి
భేటీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ..దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలావరకు పరిష్కరించామని వెల్లడించారు. ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని, తెలంగాణ వచ్చిన నాటికి ఉద్యో గుల పెండింగ్ బిల్లులు లేవని తెలిపారు. పదేళ్ల బీఆరెస్ హయాంలో వేల కోట్ల బిల్లు లు పేరుకుపోయాయని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే బిల్లుల పరిష్కారానికి కసరత్తు ప్రారంభించామని గుర్తుచేశారు.
ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించారని, సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారని ఉద్ఘాటించారు.
భేటీలో టీజీ ఈజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, జి.శ్రీనివాస్ రెడ్డి, పి.దామోదర్‌రెడ్డి, జి.సదానందం గౌడ్, వి.రవీందర్ రెడ్డి, వి.రాజ శేఖర్, కె.రామకృష్ణ, ఎస్.రాము లు, చావ రవి, మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, బి.శ్యామ్, కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు ధన్యవాదాలు
ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో గతంలో చాలావరకు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేసుకున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతోపాటు ఉద్యోగ సంఘా ల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనలర్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టమైన హామీని సీఎం ఇచ్చినందున ౫న నిర్వహించనున్న సామూహిక నిరహార దీక్షను విరమించుకున్నట్లు ప్రకటించారు.






