8 July, 2026 | 8:54 PM

మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

08-07-2026 08:07 PM

అదనపు కలెక్టర్ వేణుగోపాల్

బూర్గంపాడు,(విజయక్రాంతి): మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి కేంద్రంలో కచ్చితంగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.బుధవారం బూర్గంపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో మీసేవ కేంద్రాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాలు నిర్ణయించిన పని వేళలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

దరఖాస్తుదారుల నుంచి అవసరం లేని భౌతిక పత్రాలను మండల రెవెన్యూ కార్యాలయాలు కోరకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రసీదుల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కాగితపు రసీదులకు బదులుగా దరఖాస్తుదారుల మొబైల్‌కు రసీదు సందేశం పంపించి, అవసరమైతే ఈ-ప్రింట్ సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన సేవా రుసుములకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు మొత్తాలు వసూలు చేయరాదని హెచ్చరించారు. దరఖాస్తులకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను మాత్రమే అప్లోడ్ చేయాలని, ప్రతి పత్రాన్ని స్పష్టంగా స్కాన్ చేసి నాణ్యతతో అప్లోడ్ చేయాలని సూచించారు.

ప్రతి మీసేవ కేంద్రంలో రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ సేవల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తారని, వారితో మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకత, బాధ్యతతో సేవలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ సమావేశంలో  తహసీల్దార్ ప్రసాద్,మండలంలోని జీపీఓలు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మీసేవ కేంద్రాల వీఎల్‌ఈలు,ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు , జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.