5 May, 2026 | 2:33 PM

రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి

05-05-2026 01:10 PM

మే 2 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం

యువత, వైద్యులు ముందుకు వచ్చి సభ్యత్వం పొందాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, మే-05(విజయ క్రాంతి): జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు  అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పెద్దపల్లి జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వాన్ని గణనీయంగా పెంచాలని తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో రెడ్ క్రాస్ సంస్థ చేపట్టిన రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, వరద సహాయక కార్యక్రమాలను అధికారులు వివరించినట్లు తెలిపారు. “మానవ సేవే మాధవ సేవ” అన్న భావనతో రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మే 2, 2026 నుంచి మే 23, 2026 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పెద్దపల్లి ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయంలో నమోదు కొనసాగుతుందని, సభ్యత్వం ద్వారా సేకరించిన నిధులు రక్తదానం, వైద్య సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, అనాథలు, నిరుపేదలకు సేవలందించడానికి వినియోగించబడతాయని వివరించారు. మెడికల్ కాలేజీ వైద్యులు, ప్రైవేట్ డాక్టర్లు పెద్ద ఎత్తున సభ్యత్వం పొందాలని, డిగ్రీ మరియు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ముందుకు వచ్చి సభ్యత్వం పొందాలని, యువత సామాజిక సేవలో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సభ్యత్వం వ్యక్తిగత, జీవితకాల (లైఫ్), సంస్థలు/సంఘాల ద్వారా గ్రూప్ సభ్యత్వాల రూపంలో పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి చైర్మన్ రాజ్‌గోపాల్, వైస్ చైర్మన్&  అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్, ఈసీ నంబర్ల డీవోలు మూర్తి, అంజన్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.