హ్యాంగ్‌మన్ కథకు హ్యాట్సాఫ్
బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మన్’. అజయ్ మైసూ ర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్లపై వీ శ్రీకాం త్, అజయ్ మైసూర్, వీహెచ్ రావు నిర్మించారు. ఈ మూవీ జూలై 3 నుంచి సన్ నెక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ నందినీరెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. “హ్యాంగ్‌మన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నా.
దీన్ని ఎలాంటి ఉద్యోగం అనాలో కూడా నాకు తెలీడం లేదు. ఉరి తీసే వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది? అని అనుకుంటూ ఉంటా. అతని మానసిక వ్యథ ఎలా ఉంటుంది? అనే దాన్ని విహాన్ చక్కగా పట్టుకున్నాడు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి కథను చెప్పిన విహానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘హ్యాంగ్‌మన్’ గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘ఇలాంటి కథకు నన్ను అనుకున్న విహాన్‌కు ఎప్పుడూ రుణ పడి ఉంటాన’ని బ్రహ్మాజీ తెలిపారు.
డైరెక్టర్ విహాన్ మాట్లాడుతూ.. “హ్యాంగ్‌మన్’లోని అంశాలు చాలా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. మనం చేసే ఉద్యోగాల్లో ‘హ్యాంగ్‌మెన్’ జాబ్ ఉండదు. కొత్త సబ్జెక్ట్, కంటెంట్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. అందుకే ‘హ్యాంగ్‌మెన్’ కథను రాసుకున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అజయ్ మైసూర్, ఉదయ్ గుర్రాల, పరేషాన్ డైరెక్టర్ రూపక్, రియల్ హ్యాంగ్‌మన్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్, ఎడిటర్ కార్తిక్, శశికిరణ్ నారాయణ్, నటుడు సన్నీతోపాటు అతిథులు కూడా మాట్లాడారు.






