విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు
గద్వాల టౌన్: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించి,వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాల పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా సదుపాయాలు, తరగతి గదులు, వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉండేలా నిరంతరం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల వంటశాలను సందర్శించి, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు,నిల్వ చేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన,పోషకాహారం అందించాలని, వంటశాలలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్యం,భద్రత,విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రిన్సిపాల్ భవాని, అధ్యాపకులు,వార్డెన్లు, సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






