25 July, 2026 | 3:47 AM

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం

25-07-2026 01:32 AM

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

షాద్నగర్లో బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం 

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్ ఆవిష్కరణ

రంగారెడ్డి, జులై 24 (విజయక్రాంతి): షాద్నగర్ పట్టణంలోని ఏపీ కాంప్లెక్స్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పతంగి రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సమావేశ ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర అధ్యక్షుడికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు రూపకల్పన చేసిన ‘ఫీజుల బకాయి... బీజేపీ లడాయి’ ప్రత్యేక పోస్టర్ను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు అందకారంలోకి నెట్టబడుతోందని మండిపడ్డారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో ప్రజల తరఫున చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బూత్ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ముఖ్య నాయకులు శ్రీశైలం, కొప్పు బాషా, కేస్ రత్నం, శ్రీరాములు, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్లతో పాటు స్థానిక బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య మరియు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.