1 March, 2026 | 5:13 AM

న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం

28-02-2026 06:30 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపనార్ రమేష్

కుమ్మేర ఘటనపై ఆందోళన

జిల్లా కేంద్రంలో రాస్తారోకో 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్ వద్ద వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసిపాప మృతి ఘటనకు కారణమైన అగ్రవర్ణ నాయకులపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపనార్ రమేష్ మాట్లాడుతూ... ఘటన జరిగినప్పటి నుంచి సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసిపాప మరణానికి బాధ్యులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి దోషులపై కఠిన చర్యలు చేపట్టకపోతే, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన కుల వివక్షను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.