9 May, 2026 | 1:19 AM

సీజ్ చేసినా ఆగని నీటి దందా!

09-05-2026 12:00 AM
  1. అధికారుల చర్యలపై సవాల్‌గా అక్రమ నీటి తవ్వకాలు
  2. పగటిపూటే బహిరంగంగా దందా
  3. పలు కమ్యూనిటీలు రూ.5-6 లక్షల ఖర్చు

పటాన్‌చెరు, మే 8 : అధికారుల కళ్ళుగప్పి అక్రమ నీటి దందా జోరుగా కొనసాగుతోంది... తెల్లాపూర్ ప్రాంతంలో వేల లీటర్ల ట్యాంకులలో నీటిని నింపి లారీల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. కొందరు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అక్రమ నీటి వ్యాపారంపై విజయక్రాంతి దినపత్రిక  కథనాలను ప్రచురించడంతో అధికారులు స్పందించి దాడులు సైతం నిర్వహించారు.

అయితే అధికారులు దాడులు నిర్వహించినప్పుడే అక్రమార్కులు నిమ్మకుండి ఆ తర్వాత వారి దందా యధావిధిగా కొనసాగిస్తున్నారు. అధికారుల దాడులకు ధిక్కారంగా బహిరంగంగానే అక్రమ నీటి దందా కొనసాగిస్తున్నారు. తెల్లాపూర్ డివిజన్ ప్రాంతంలో అక్రమ నీటి దందా పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని నివాసితులు ఫిర్యాదు చేస్తున్నారు.

తెల్లాపూర్లో భారీగా భూగర్భ జలాల తోడివేత చేపడుతున్నారు. తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, గోపన్పల్లి ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లు అక్రమంగా బోర్లు వేసి రోజుకు లక్షలాది లీటర్ల నీటిని తోడేస్తున్నారు. దీనివల్ల ఇక్కడి గేటెడ్ కమ్యూనిటీల్లోని బోర్లు ఎండిపోతున్నాయి. తెల్లాపూర్‌ఉస్మాన్ నగర్ రోడ్డుపై నిరంతరం తిరుగుతున్న వందలాది భారీ వాటర్ ట్యాంకర్ల వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలగడమే కాకుండా, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ట్యాంకర్ డ్రైవర్లు రాంగ్ రూట్లో వస్తూ అడిగిన వారిని బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  మున్సిపల్ నీటి సరఫరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో, గేటెడ్ కమ్యూనిటీలు ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని ట్యాంకర్ల ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో పలు కమ్యూనిటీలు నీటి కోసం నెలకు రూ. 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ అక్రమ నీటి తోడివేతపై సంగారెడ్డి కలెక్టర్, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అక్రమ బోర్లు వేసిన వారిపై, నిబంధనలు పాటించని ట్యాంకర్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.