సమస్యల వలయం ‘లెండి’
- ఇంకా పూర్తికాని గేట్ల నిర్మాణాలు
- నిధుల మంజూరీలో జాప్యం
- 2027 రబీ సీజన్ కు పనులు పూర్తయ్యేనా?
- ఇంకా కొన్ని గ్రామాలు ఖాళీ చేయని వైనం
- అధికారుల అసంపూర్తి సర్వే
జుక్కల్, మే 8 (విజయ క్రాంతి):తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్న లెండి ప్రాజెక్టు మహారాష్ట్ర భూభాగంలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ వద్ద మంజీరా నదిపై నిర్మిస్తున్నారు. 2026 వరకు మొత్తం ఈ ప్రాజెక్టు సమస్యల వలయంలో విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్టు పనులు పెండింగ్లో ఉండడం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ రైతులకు ఘోష మిగిలిందని చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సమగ్రంగా సర్వే చేపట్ట లేకపోవడం కొన్ని గ్రామాలు ఖాళీ చేయకపోవడం ఇవన్నీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరిద్దరని అవలంబించడమే కారణమంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అదేవిధంగా ఇరు రాష్ట్రాల అధికారులు నిధుల మంజూరులో జాప్యం చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని విమర్శిస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు 2027 మే నెలలో మిగతా పనులు పూర్తి చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపినట్లు సమాచారం. దీని గురించి సమగ్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లేండి ప్రాజెక్టు 1984లో పనులు ప్రారంభించి, అంచనా వ్యయం 54 కోట్ల 55 వేలతో ప్రారంభం అయింది. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు.
తెలంగాణ భూభాగంలో నీరు అందించేందుకు కూడా ఇప్పటివరకు ఎర్త్ డ్యామ్ 98% పనులు పూర్తయ్యాయి. గేట్లు, స్పిల్వే 99% వరకు పనులు పూర్తయ్యాయి. కానీ కాల్వల పనులు మరియు కొంత భూసేకరణ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 14 గేట్లలో 10 గేట్లు అమర్చగా, మరో 3 గేట్ల పనులు మరియు హోయిస్టర్ల ఏర్పాటు కొనసాగుతోందని మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రధాన సమస్యలు
ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణాలు నిధుల కొరత, భూసేకరణ జాప్యం, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపంతో పనులు ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. మొదట్లో కంటే ప్రస్తుతం అంచనా వ్యయం భారీగా పెరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. 2006లో రూ.128 కోట్లు ఉన్న అంచనా వ్యయం ఇప్పుడు రూ.841 కోట్లకు చేరిందని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,183.88 కోట్ల వరకు పెరిగిందని నివేదికలు ద్వారా తెలుస్తోంది. అయితే తెలంగాణ అధికారులు ప్రాజెక్టు ఆలస్యం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరింత ఆలస్యం అయితే ఖర్చు భారం పెరుగుతుందని చెప్పారు.
భూములు, గ్రామాలు :
ప్రాజెక్టు కోసం రైట్ బ్యాంక్ కెనాల్ కు 1,075 ఎకరాలు అవసరం కాగా, 655 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. ఇంకా భూసేకరణ కారణంగా పెండింగ్లో ఉంది. ముంపు ప్రాంతానికి సంబంధించి 12 గ్రామాల్లో 7 గ్రామాలను తరలించామని, మరో 5 గ్రామాలను తరలించాల్సి ఉందని మహారాష్ట్ర అధికారులు సమావేశంలో తెలిపారు.
రాష్ట్రాల వాటా, నిధులు
లేండి ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా రూ.841 కోట్లు, మిగతా మహారాష్ట్ర భరిస్తున్నదని తాజా సమాచారం. మహారాష్ట్ర అధికారులు పెండింగ్లో ఉన్న రూ.196 కోట్లు తెలంగాణ కు డిపాజిట్ చేయాలని కోరారు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు సమావేశంలో కోరినట్లు నివేదిక ఉంది. గతంలో కూడా ఇరు రాష్ట్రాల పాలకులు, ఇరిగేషన్ శాఖలు చర్చలు జరిపినా పూర్తి స్థాయిలో జరగలేదు.
రాజకీయ ప్రయత్నాలు
తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపి పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, అక్కడి ప్రజలు ప్రాజెక్టు అంశాన్ని మంత్రికి తీసుకెళ్లగా, ఆయన మహారాష్ట్ర అధికారులతో చర్చలు కొనసాగిస్తామని చెప్పారు. తాజా కోఆర్డినేషన్ మీటింగ్లో తెలంగాణ అధికారులు ఆలస్యంపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసి, పనులు త్వరగా పూర్తయ్యేలా ఒత్తిడి తెచ్చారు.
లెండి ప్రాజెక్టు పూర్తయితే నీటి వాటా
తెలంగాణలో సుమారు 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మహారాష్ట్ర భాగాన్ని కలుపుకుని మొత్తం ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 49 వేల ఎకరాలు అని అక్కడ అధికారులు చెబుతున్నారు.
ప్రాంతాల వారీగా :
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లో సుమారు 22 వేల ఎకరాలు మీరు అందుతుందని అంచనా. అదేవిధంగా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల్లో సుమారు 27 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు.
ప్రాజెక్టు సామర్థ్యం
ప్రాజెక్టు సామర్థ్యం 6.36 టీఎంసీలు / 6.37 టీఎంసీలుగా పేర్కొనబడింది, ఇందులో తెలంగాణ వాటా 2.43 టీఎంసీలు, మహారాష్ట్ర వాటా 3.93 టీఎంసీలుగా ఉంది.
తెలంగాణకు ముఖ్య ప్రయోజనం
తెలంగాణలో ఈ ప్రాజెక్టు పూర్తయితే జుక్కల్ ప్రాంతంలోని వెనుకబడిన గ్రామాలకు సాగునీరు అందే అవకాశం ఉంది, అందుకే ఇది స్థానికంగా చాలా కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. దీని కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గెలిచిన మొదట్లో ప్రాజెక్టును సందర్శించి అక్కడ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.






