వేగంగా ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు
మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. మక్కజొన్నలు 16 లక్షల 47వేల 278 బస్తాల మొక్కజొన్నలు గోదాముకు తరలించామని, అలాగే 89వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించినట్లు చెప్పారు.
జిల్లావ్యాప్తంగా స్వయంగా కలెక్టర్ పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శించి, ప్రత్యేక అధికారులకు సూచనలు జారీ చేస్తూ నిరంతరం రైతులకు ఇబ్బందులు కలవకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే విధులలో తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.గత వారం రోజుల్లో 13 వేల 434 మంది రైతుల నుంచి 214 కేంద్రాల నుండి 97 వేల 246 మెట్రిక్ టన్నుల ధాన్యంకు గాను 89వేల టన్నుల ధాన్యాన్ని సేకరించి,73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం జరిగిందన్నారు.
ప్రాథమిక సహకార సొసైటీ, ఐకెపి, గిరిజన కార్పొరేషన్, మెప్మాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను పూర్తిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పర్యవేక్షిస్తూ అధిక హమాలీలను, లారీలను, ట్రాక్టర్స్, ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాలలో ఉన్న మిల్లులు గోదాములలోకి తరలించడం కోసం జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేసిందని, ప్రతి కేంద్రంలో అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, టెంట్ లు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, రవాణా చేయు సందర్భములలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ విధంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
మక్కజొన్నల కొనుగోళ్లలో జిల్లా లక్ష్యం 1 లక్ష, 37వేల 910 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 82 వేల 363 .900 మెట్రిక్ టన్నుల మక్కజొన్నలు 16వేల 059 మంది రైతుల నుండి 16 లక్షల 47 వేల 278 మక్కల బస్తాలను కొనుగోలు చేసి, ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కొనుగోలను చేసి తరలించడం జరిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా లో మార్క్ఫెడ్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అటు సెంటర్ నిర్వాహకులు ఇటు అధికారులతో సమన్వయపరుస్తూ కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రానున్న వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.






