జనం గుండెల్లో పెద్ది
- నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఆప్తమిత్రున్ని కోల్పోయా: హరీశ్‌రావు
- పెద్ది విగ్రహ గద్దె కూల్చివేతపై బీఆర్‌ఎస్ నిరసన
మహబూబాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎన్నేళ్లు బతికామన్నది అన్నది ముఖ్యం కాదు.. ఎట్లా బతికామన్నది ముఖ్యమని.. అనునిత్యం ప్రజల క్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు లక్ష మంది జనం స్వచ్ఛందంగా తరలి రావడమే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లిలో సోమవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నర్సంపేట ప్రాంత రైతాంగం సంక్షేమం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన కృషి మరచిపోలేనిదని, పెద్ది జన్మ ధన్యమైందని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితోనే దేవాదుల నీరు చెరువుల్లోకి మళ్లించారని, రాష్ర్టంలో జిల్లా కేంద్రానికి వెలుపల నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించడం వెనక పెద్దికి ఈ ప్రజలపై ఉన్న మమకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండు సంవత్సరాలలో తిరిగి రాష్ర్టంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే నర్సంపేట లోని మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి తీరుతామని ప్రకటించారు.

కంటతడి పెట్టిన హరీశ్‌రావు
పెద్ది సుదర్శన్‌రెడ్డి సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం కోసం నిర్వహించిన అనేక కార్యక్రమాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2014లో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యేగా పరాజయం పాలు కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు సివిల్ సప్లు కార్పొరేషన్ చైర్మన్‌గా క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చారని చెప్పారు.
పెద్దితో కలిసి ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలను గుర్తు చేసుకుంటూ హరీశ్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. నెల రోజులపాటు హనుమకొండలో పెద్ది తాను ఒకే రూమ్‌లో ఉండి అనేక ఉద్యమాలను నిర్వహించడంలో పాలు పంచుకున్నామని, పెద్దిలాంటి ఆప్త మిత్రుడిని కోల్పోవడం తనకు తీరనిలోటని హరీశ్‌రావు కంటతడి పెట్టారు.
పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నర్సంపేటలో నిర్మిస్తున్న గద్దెను మున్సిపల్ సిబ్బంది ఆదివారం రాత్రి తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహావిష్కరణ కోసం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ప్రదేశంలో గద్దె నిర్మాణానికి పూనుకున్నారు. అయితే మున్సిపల్ అనుమతి లేదని ఆదివారం రాత్రి ఉన్నఫలంగా గద్దెను కూల్చడంతో విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు నర్సంపేటలో ఆందోళనకు దిగారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఆవిష్కరించి తీరుతామని ప్రకటించారు. ఈ కుట్రలు చూస్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పై కూడా మాకు అనుమానాలు వస్తున్నాయని, తనను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో అర్ధం ఆవుతుందన్నారు.
విగ్రహం గద్దెను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణమని, నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారని ప్రశ్నించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలిక ఈ ధర్నాను విరామించుకున్నామని, 2 రోజుల సమయం ఇస్తున్నాం ఆలోపు ఈ విగ్రహ గద్దెను కూల్చిన వారినీ శిక్షించకపోతో రాష్ట్రవ్యాప్తముగా, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామ గ్రామన పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.






