ఊపిరాడని రంగాయపల్లి!
- ఎంఎస్ స్టీల్ ప్లాంట్‌పై గళమెత్తిన జనం
- మాకొద్దు ఈ మృత్యుకూపం అంటూ నిరసనలు
- స్టీల్ ప్లాంట్ విస్తరణపై తిరగబడ్డ గ్రామస్తులు
- మనోహరాబాద్ ఉక్కు ఫ్యాక్టరీపై దండయాత్ర
- ప్రజాభిప్రాయ సేకరణ చేసినా ఫలితం శూన్యం
- రంగాయపల్లి గ్రామస్తుల నిరాహార దీక్ష
సంగారెడ్డి, జూలై 12(విజయక్రాంతి)/తూప్రాన్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండ లం రంగాయపల్లి ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఉక్కు పరిశ్రమ) చుట్టుపక్కల గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం, నిరంతర ప్రమాదాల భయంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీని మరింత విస్తరించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలపై ‘మాకొద్దు ఈ ప్లాంట్.. మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ ప్రజా సంఘాలు, స్థానిక రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. మరోపక్క ఈ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు మృగ్యమయ్యాయి.
గతంలో ఫ్యాక్టరీలోని ఫర్నేస్ (భారీ భట్టీ) పేలి కరిగిపోయిన లోహం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ పారిశ్రామిక పేలుడులో కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలాంటి వరుస ప్రమాదాల వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
ఊపిరితిత్తులను ముంచేస్తున్న వాయు కాలుష్యం
ప్లాంట్ నుంచి రాత్రింబవళ్లు వెలువడుతున్న నల్లటి దట్టమైన పొగ, రసాయన వ్యర్థాల గాలి చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తోంది. దీంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాసకోశ వ్యాధులు, అస్థమా, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడం తో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఫ్యాక్టరీ నుంచి విడిచిపెడుతున్న రసాయన వ్యర్థాలు స్థానిక భూముల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఫలితంగా బోర్ల నుంచి వచ్చే నీరు రంగుమారి, తాగడానికి పనికిరాకుండా పోతోంది.
కలుషిత నీటి వల్ల ప్రజలు గ్యాస్ట్రిక్, మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారు. పొగమంచులా పేరుకుపోతున్న ఫ్యాక్టరీ దుమ్ము, రసాయన కణాలు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలపై, చెట్లపై దట్టంగా పేరుకుపోతున్నాయి. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతిని పంట దిగుబడి ఘోరంగా పడిపోతోంది. కలుషిత నీరు, గాలి వల్ల భూములు బంజరుగా మారుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పర్యావ రణ చట్టాలను తుంగలో తొక్కిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తక్షణమే స్పం దించి ప్లాంట్‌ను తనిఖీ చేయాలని, ప్రభు త్వం, అధికారులు తక్షణమే స్పందించి రంగాయపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాలను, భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక
కొంతకాలంగా స్థానిక ప్రజల నుంచి వచ్చిన తీవ్ర ఫిర్యాదులు, ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది. అధికారులు జరిపిన తనిఖీల్లో కంపెనీ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలింది. ప్లాంట్ నుంచి విపరీతంగా వెలువడుతున్న జింక్ దుమ్ము, నియంత్రణ లేని పొగ ఉద్గారాలు, రసాయనాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నట్లు బోర్డ్ గుర్తించింది. పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించినందుకు, డిసెంబర్ 2025లో తెలంగాణ పొల్యూషన్ బోర్డు ఈ ఉక్కు పరిశ్రమను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ నిర్మాణాలు..తీవ్రమైన ఆందోళనలు
గ్రామ పంచాయతీ లేదా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే ప్లాంట్ లోపల అక్రమంగా భారీ షెడ్లు నిర్మించినట్లు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ విచారణలో రుజువైంది. రంగాయపల్లి, చెట్లగౌరారం, కోనాయి పల్లి గ్రామస్థులు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. 2019 లోనే ఫ్యాక్టరీ కాలుష్యం గ్రామాలను ముంచెత్తుతోందని స్థానికులు మొదటిసారి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అనుమతులు లేని నిర్మాణాలపై అధికారులను నిలదీస్తూ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించా లని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 15, 2025న ప్లాంట్‌లోని ఐరన్ కరిగించే భారీ భట్టీ పేలిపోయింది. కరిగిపోయిన లోహంలీక్ అవ్వ డం, తీవ్ర ఉష్ణ వికిరణం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు ఘోరం గా కాలిపోయారు. ఈ ప్రమాదంలో అన్షు అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన వందలాది మంది కార్మికులు, స్థాని కులు ప్లాంట్ ముందు భారీ ధర్నా నిర్వహించి యాజమాన్యంపై చర్యలు కోరా రు. ప్రస్తుతం మూసివేత ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్లాంట్ విస్తరణకు యాజమాన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలతో స్థానికులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. ‘మమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వరా?’ అంటూ మహిళలు, ప్రజా సంఘాల నేతలు తాజాగా ఆందోళనలు చేపట్టారు. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ నేతృత్వంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తమ గోడును విన్నవించుకోగా విచారణ జరిపి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చారు.
కంపనీ మాకు వద్దే వద్దు
మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వల్ కంపెనీ ‘మాకు వద్దు’ అంటూ గ్రామంలోని మహిళలు ధ్వజమెత్తారు. ఆదివారం నిర్వహించిన నిరసనకు మద్దతుగా గజ్వేల్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటే రు ప్రతాప్‌రెడ్డి గ్రామ పంచాయతీ వద్ద నిరాహార దీక్షా చేపట్టారు. వీరితోపాటు నియోజ కవర్గ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ కంపనీ వల్ల మా పిల్లలకు చర్మ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, అంగ వైకల్యం వస్తుందని, గర్భంలో పిండాలు కరిగిపోతున్నా యని, భూగర్భ జలాలు రంగు మారుతున్నాయని వాపోయారు. ఏళ్ల తరబడి బాధలు అనుభవిస్తున్నాం.. ఈ కంపనీ మాకు వద్దు.. మా ఆరోగ్యమే ముద్దు.. అని మహిళలు మొర పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే చర్యలు తీసుకొని కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.






