13 July, 2026 | 3:01 AM

సైకోశాడిస్టు రేవంత్‌రెడ్డి!

13-07-2026 02:07 AM
  1. హిట్లర్ తరహాలో సీఎం హంతక భాష
  2. రైతులు నీళ్లు అడిగితే రక్తం అడుగుతవా?
  3. 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి కేసీఆర్ ఘనతే
  4. పట్టిసీమకు నీళ్లు.. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణే
  5. నా ప్రాణం పోయినా సరే.. మోటార్లు ఆన్ చేయండి
  6. మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా లేక సైకో, శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అన్న అనుమానం కలిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆయన మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయ న్నారు. రైతులు సాగునీరు అడిగితే.. రక్తం అడుగుతావా? దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని ఒక సీఎం మాట్లాడటం అత్యంత జుగుప్సాకరమని మండిపడ్డారు.

2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి కేసీఆర్ ఘనతే అన్నారు. పట్టిసీమకు నీళ్లు వదిలేసి.. గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ ఇచ్చాడని ఆరోపించారు. నీ ఇగో కోసం మోటార్లు ఆపితే.. థర్మల్ పవర్ ప్లాంట్లు ఆగిపోయి రాష్ట్రం అంధకారం కావడం ఖాయమని హరీశ్‌రావు తెలిపారు. హిట్లర్ తనకు ఆదర్శం అన్న రేవంత్‌రెడ్డి, అదే హిట్లర్ తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు గోదావరిలో నీళ్లే లేవు అని అబద్ధం చెప్పిన సీఎం..

కేటీఆర్ అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్‌లో చూపించగానే నాలుక కరుచుకున్నారని అన్నారు. సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే, పక్కనే ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మైక్ లాక్కుని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నిన్నటి దాకా నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం.. ఇప్పుడు వాళ్లు నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు సైతం కేవలం రూ.8.5 కోట్ల ఖర్చుతో ఒక కాఫర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. కానీ నీళ్లు ఎత్తకుండాన మోటార్లు ఆన్ చేయడం లేదని, రేవంత్‌రెడ్డి ఈగోలకు పోతున్నారని మండిపడ్డారు. 

2.60 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కేసీఆర్ ఘనతే... 

ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమని, 2004లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా ‘నా పేరు కూడా శిలాఫలకంపై ఉంది’ అని గుర్తు చేశారు. 2014 వరకు రూ. 3,347 కోట్లు ఖర్చుపెట్టినా అందులో 5 టీఎంసీల నీళ్లు కూడా నిలపలేకపోయారని అన్నారు. తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో కేవలం 7 టీఎంసీలే ఉన్నాయని, అందులో డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4- టీఎంసీలు మాత్రమే ఉంటాయన్నారు.

ఎల్లంపల్లి నుంచే ఎన్టీపీసీకి 5 టీఎంసీలు, సింగరేణికి 5 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరమని, సీఎం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల 24 గంటల కరెంట్, రైతుబంధు, సాగునీరు వల్ల 2023 నాటికి ఏకంగా 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందన్నారు. వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగిందని, ఇది ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే అని స్పష్టం చేశారు. 

28 లక్షల క్యూసెక్కులైనా బరాజ్‌లకు ఏమీ కాలేదు

అన్నారం, సుందిల్ల బరాజ్‌ల్లో నీళ్లు ఆపితే భద్రాచలం మునిగిపోతుందనడం శుద్ధ అబద్ధమని హరీశ్‌రావు మండిపడ్డారు. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిళ్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నిలిపితే.. ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందికి వెళ్లేది కేవలం 1.10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమేనన్నారు.  2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలం ఏమీ కాలేదని గుర్తు చేశారు. అలాంటిది లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందని సీఎం చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

పంతాలతో పంటలు ఎండబెట్టకండి

నాడు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్డీఎస్ చట్టం రాష్ట్రాల హక్కులు కాలరాయడమే అని వ్యతిరేకించి, రాతపూర్వకంగా ఇచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నేడు అదే ఎన్డీఎస్ బైబిల్ లాగా కనిపిస్తోందన్నారు. మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్.. 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సీఈవోలుగా పనిచేశారని తెలిపారు. వాళ్లు మేడిగడ్డ 3 పిల్లర్ల కుంగుబాటుపై రిపోర్టు లు ఇస్తారా అని ప్రశ్నించారు.

ఎల్‌నినో కరువు పరిస్థితుల్లో ప్రతి చుక్క ముఖ్యమని, ఇప్పుడున్న 50- వేల క్యూసెక్కుల వరదను కన్నె పల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తుకోవాలన్నారు. మోటార్లు బంద్ పెట్టి, నీళ్లు కిందకు వదిలేస్తూ ఆంధ్రాలోని పట్టిసీమకు మేలు చేస్తున్నారని తెలిపారు.

ఇది కాంగ్రెస్ పాలన కాదు, గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఇచ్చుకుంటున్న గురుదక్షిణ అని చెప్పారు. మీ ఈగోలకు, పంతాలకు పోయి రైతుల పంటలను ఎండబెట్టకండి.. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడండి.. క్రెడిట్ అంతా మీరే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు రాష్ట్రం ‘నిన్ను బోనులో నిలబెడుతుంది.. ఖబర్దార్’ అని హెచ్చరించారు.