13 July, 2026 | 1:59 AM

సమస్యల్లో గురుకుల విద్యార్థినులు

13-07-2026 12:00 AM
  1. మెట్‌పల్లిలో పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతోనే భోజనం
  2. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. పట్టించుకోని ప్రిన్సిపాల్

మెట్ పల్లి, జులై 12(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి శివారులోని స్థానిక షెడ్యూల్ కులాల గురుకులంలో విద్యార్థినులకు పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయల భోజనమే ప్రతి రోజు దిక్కవుతోంది. కాంట్రాక్టర్ల ధన దాహం ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం గురుకులంలో కూరగాయల సరఫరాకు ఒకరు, వంట చేయడం కోసం మరో కాంట్రాక్టర్ ఉన్నారు.  కూరగాయల కాంట్రాక్టర్ కుళ్లిన కూరగాయలు సరఫరా చేస్తున్నాడు.

ఇక వంట చేయడం కోసం నియమించిన కాంట్రాక్టర్ సిబ్బంది దొరకడం లేదనె సాకుతో తానే ఇష్టం వచ్చినప్పుడు వంట చేస్తూ ఒక్కడే నెట్టుకోస్తున్నాడు. ఒక్కడే వంట చేయడంతో ఉదయం 8గంటలకు ఇవ్వాల్సిన టిఫిన్ 10 గంటలకు ఇస్తున్నారు. పిల్లలు ఎవరైనా అడిగితే కాంట్రాక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపిస్తాము అంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 60ఏళ్ల వయస్సు లోపల ఉన్న పురుషులు గురుకులం లోపలికి అనుమతి లేకున్న ఈ కాంట్రాక్టర్ ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గురుకులంలో పరిస్థితి పై పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురుకులం ముందు శనివారం ఆందోళనకు దిగారు.

దీంతో స్పందించిన జిల్లా అధికారుల ఆదేశాలతో స్థానిక తహసీల్దార్ ఆదివారం గురుకుల కళాశాలను సందర్శించారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ లు అక్కడ లేకపోవడంతో  తన ఆఫీస్ వచ్చిన తనను కలవాలని తహసీల్దార్ ఆదేశించి వెళ్లారు. వంట కాంట్రాక్టర్ తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తననే ఆఫీస్ కు పిలిపిస్తారా అంటూ తహసీల్దార్ పై పైర్ అయినట్లు తెలిసింది. దీంతో తహసీల్దార్ కాంట్రాక్టర్ ను పోలీసులు అప్పగించినట్లు సమాచారం.

కాగా ఇటు పేరెంట్స్ కమిటీ లేక అటు ప్రిన్సిపాల్, సిబ్బంది పట్టించుకోక విద్యార్థులు ఇక్కటు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సమస్యలపై వివరణ కోసం వెళ్లగా విలేకరులకు గురుకులంలోకి అనుమతి లేదు, తాను కూడా ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అటెండర్‌తో ప్రిన్సిపాల్ చెప్పి పంపడం కొసమెరుపు. గురుకులంలో సమస్యలపై మెట్‌పల్లి ఎంఈవో కనకతార స్పందిస్తూ  ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిం చామని, త్వరలోనే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.