29 July, 2026 | 4:24 PM

జిల్లాలో ఎడతెరిపి వర్షాలు.. రైతుల్లో ఆనందం

29-07-2026 03:37 PM

బోధన్,(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపాయి. వరి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలకు ఈ వర్షాలు ఎంతో అనుకూలంగా మారాయని రైతులు చెబుతున్నారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుతుండగా భూగర్భ జలాల మట్టం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

అత్యధికంగా మెండోరా మండలంలో 115.6 మి.మీ, మోపాల్ మండలంలో 112.4 మి.మీ, నవీపేట్ లో112 మి.మీ. మోస్రా లో 109 మి.మీ, డిచ్‌పల్లి లో 106.6 మి.మీ, నిజామాబాద్ రూరల్ లో 100.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక అత్యల్పంగా బోధన్ లో40.8 మి.మీ, నందిపేట్ లో 48.4 మి.మీ, భీమ్‌గల్ లో 48.8 మి.మీ.వర్షపాతం నమోదైంది. నిరంతర వర్షాలతో సాగునీటి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ఖరీఫ్ పంటలకు ఇది ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మరో 24 గంటలు వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.