తాళం వేసిన ఇంట్లో చోరీ
- 8 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు అపహరణ
- ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ నాగేంద్ర చారి
గంభీరావుపేట,(విజయ క్రాంతి): తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు బంగారం, వెండి, నగదును దోచుకెళ్లిన ఘటన గంభీరావుపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన పత్తి స్వామిరాజ్ కుటుంబ సభ్యులు అనారోగ్య కారణంగా రెండు రోజుల క్రితం కరీంనగర్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అనంతరం బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదును అపహరించారు.గురువారం ఉదయం ఇంటి వద్ద అనుమానాస్పద పరిస్థితిని గమనించిన స్థానికులు బాధితులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఇంటికి చేరుకుని సామగ్రి చిందరవందరగా ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్సై శ్రీకాంత్ సంఘటనపై వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






