22 May, 2026 | 4:39 AM

రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు

22-05-2026 12:08 AM
  1. ఏక్యూడ్ అల్పా సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతుండు
  2. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) : రాహుల్‌గాంధీవి పిల్ల చేష్టలు, చిల్లర చేష్టలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. ఏక్యూడ్ అల్పా సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతూ బయోలాజికల్ అర్జన్సీతో ఉన్నాడని ఎద్దేవా చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5.67తో ఫాస్టెస్ట్ గ్రోత్‌తో దేశం ముందుకు వెళ్తుందని, 800 బిలియన్ల ఎగుమతులు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే  ఎక్కడా లేని విధంగా భారత్‌లో ప్రతి రోజూ 30 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మితమవుతున్నాయని వెల్లడించారు. ఇండియా సేఫ్ అని మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని స్పష్టం చేశారు. నెహ్రూ కుటుంబం దేశ ద్రోహం కుటుంబమని మండిపడ్డారు. ప్రధాని కావాలని దేశాన్ని విభజించారని, లక్షలాది మంది చావుకు కారణం అయ్యారని ఆరోపించారు. దేశ విభజన వద్దని అంబేద్కర్ మొత్తుకున్నారని గుర్తు చేశారు.

మన నీళ్లలో 80 శాతం పాకిస్థాన్‌కు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించుకోవాలని కోట్ల రూపాయలు వారికి ఇచ్చారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి చెప్పాల్సిన అవసరం లేదని, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారని మండిపడ్డారు. మన తమిళుల మీద దాడులు చేయించి, చంపించింది రాజీవ్‌గాంధీ కాదా.. అనేక కుంభకోణాలకు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ కారణం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చైనా ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమిత్‌షా అసాధ్యం అనుకున్న బెంగాల్‌ని సుసాధ్యం చేశారని పేర్కొన్నారు.