రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్
- నగరంలో 24/7 సేవలు
- హర్షం వ్యక్తం నగరవాసులు
రంగారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): నగరం నిద్రపోవచ్చు...కానీ కలలు, అవసరాలు, రెక్కల కష్టం నిద్రపోవు. ఐటీ కారిడార్లో వెలిగే సిస్టమ్ స్క్రీన్ల నుంచి, ఆసుపత్రి కారిడార్లలో వేచి చూసే చూపుల వరకు... అర్ధరాత్రి వేళ హైదరాబాద్ ఇంకా పరుగెడుతూనే ఉంటుంది.
ఈ నైట్ షిఫ్ట్ నగరానికి ఊపిరి పోస్తూ, ప్రయాణికులకు ఊరటనిచ్చే తీపి కబురు అందించింది టీజీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకరం చుట్టింది.సెప్టెంబర్ 1 నుంచి నగరంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటివరకు రాత్రి వేళల్లో ఇళ్లకు చేరుకోవాలంటే క్యాబ్లు, ఆటో డ్రైవర్లు అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఆందోళనలతో సాగే ఆ అర్ధరాత్రి ప్రయాణాలకు ముగింపు పలుకుతూ, ఆర్టీసీ సురక్షితమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ మార్గాన్ని ప్లాన్ చేసింది.తొలిదశలో నైట్ లైఫ్తో కళకళలాడే ఆరు ప్రధాన మార్గాల్లో బస్సులను తిప్పాలని ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆయా రోడ్లలో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ముఖ్యంగా ఐటి ఉద్యోగులు,
మీద కంపెనీలు ఆఫీసుల్లో రాత్రి షిఫ్టులో విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు రాత్రి వేళలో ప్రయాణికులకు అనుకూలంగా ఆర్టీసీ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్టీసీ నిర్ణయం ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు,
నైట్ షిఫ్ట్ వర్కర్లకు, హోటల్, ఆసుపత్రి సిబ్బందికి కొండంత అండగా మారనుంది. ప్రయాణికుల స్పందన, రద్దీని బట్టి భవిష్యత్తులో ఈ నైట్ బస్సులను మరిన్ని రూట్లకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇకపై నైట్ షిఫ్ట్ ముగించుకుని హాయిగా, సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి భాగ్యనగర వాసులకు ఆర్టీసీ నమ్మకమైన నేస్తంగా మారనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బస్సులు పరుగులు తీయనున్న ప్రధాన రూట్లు ఇలా..
1) సికింద్రాబాద్ కొండాపూర్,
2) బాచుపల్లి వేవ్‌రాక్,
3) సికింద్రాబాద్ హయత్‌నగర్,
4) కోఠి పటాన్‌చెరు,
5) కోఠి హైటెక్ సిటీ,
6) సికింద్రాబాద్ పటాన్‌చెరు






