30 August, 2026 | 1:19 AM

కామారెడ్డి బల్దియాలో కౌన్సిలర్ల రచ్చ

30-08-2026 12:16 AM
  1. పోడియం వద్ద బైఠాయించిన బీఆర్‌ఎస్
  2. కుర్చీలను ఎత్తిన కాంగ్రెస్ నాయకులు
  3. బెదిరింపులపై నిలదీసిన బీజేపీ

కామారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): కామారెడ్డి బల్దియా సమావేశంలో మళ్లీ కౌన్సిలర్‌ల రచ్చ కొనసాగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసే వరకు వెళ్లింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన ఆరు ఎజెండా అంశాలతో బల్దియా సమావేశాన్ని శనివారం ప్రారంభించారు.

బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అరకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా వార్డు అధికారులు పనులు చేయించడాన్ని నిలదీశారు. దీంతో రగడ మొదలైంది. ప్రశాంతంగా జరగాల్సిన సమావేశం సమస్యలపై చర్చ లేకుండానే రచ్చ మొదలైంది. కాంగ్రెస్ కౌన్సిలర్ అంజద్ కుర్చీని విసిరి వేయడంతో వివాదం మరింత ముదిరింది.

కౌన్సిలర్ల మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పొడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్ల విధానంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యాఖ్యానిస్తూ మండిపడ్డారు. దీంతో బీజేపీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడుపార్టీల కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. చివరకు కుర్చీలు విసురుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పోలీసులు రంగప్రవేశం చేశారు.మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు కలెక్టర్ వైవీ గిరి వచ్చి కౌన్సిలర్లను సముదాయించారు.

వార్డులలోని సమస్యలపై బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పనులపై ప్రశ్నిస్తే ప్రతీసారి షబ్బీర్ అలీ, నయీమ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి కాంగ్రెస్ కౌన్సిలర్ల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆరోపించారు.