నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు
పోలీసుల విధులు, రహదారి భద్రతపై అవగాహన
ఉప్పల్,(విజయక్రాంతి): చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత మరియు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో మల్లాపూర్‌లోని చైతన్య స్కూల్ విద్యార్థులు నాచారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పాఠశాలకు చెందిన 3వ, 4వ, 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, పోలీసు అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో జరిగే రోజువారీ కార్యకలాపాలు, నేరాల నిరోధం, ప్రజలకు అందించే సేవలు, పోలీసుల బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు.
అలాగే ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ సేవలను ఎలా వినియోగించుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను ఆసక్తిగా పరిశీలించి, పోలీసు అధికారులను ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సమాజంలో పోలీసుల పాత్రను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించిందని, ఇటువంటి విద్యా పర్యటనలు పిల్లల్లో బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు.






