30 August, 2026 | 12:34 AM

కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు

29-08-2026 11:51 PM

నేరడిగొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తమద్య కుమ్ములాటలు మొదలయ్యాయి. ఉట్నూర్ మండలంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావ్ ముందర ఆదిలాబాద్ నియోజకవర్గ బాధ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి సొంతపార్టీ నాయకులపై ఇటీవల ఆగ్రహం వెళ్లకక్కిన విషయం తెలిసిందే.

అసెంబ్లి ఎన్నికల సమయంలో తనపై రెబల్ గా బరిలో నిలిచి, కాంగ్రెస్ ఓటమికి కారకులైన వారికి పీఏసీలో స్థానం కాల్పిస్తున్నందుకే ఆయన్ను వ్యతిరేకిస్తున్నట్లు కంది అనడంతో జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్  ముందు వర్గ విబేధాలు బహిర్గతమాయ్యాయి.

 నరేష్ జాదవ్ × ఆడె గజేందర్

కాంగ్రెస్ పార్టీ ఇటీవల మండల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోథ్ నియోజక వర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించిన వారికి మండల అధ్యక్ష పదవులు కట్టపెట్టారని, తన నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డవారికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే వారికి మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టారంటూ జిల్లా అధ్యక్షుడిపై గజేందర్ గుర్రుగా ఉన్నారు.

Pacs (సహకార సంఘాల ) ఛైర్మన్ల నియామకానికి రంగం సిద్ధం కావడంతో ఇరువురు అధిష్టానానికి వారి వారి అనుచరుల పేర్లతో కూడిన జాబితాలను  పంపారు. ఎంపిక విషయంలో నరేష్ జాదవ్ అనుచరులకు పదవులు దక్కుతున్నాయని గజేందర్ తెలుసుకున్నారు. ఇలా ఐతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నష్టం కలుగుతుందని, పార్టీ కోసం కష్టపడ్డవారికి అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో నియోజకవర్గ బాధ్యుడు గజేందర్ శనివారం హుటాహుటీనా హైదరాబాద్ బయలుదేరారు. టీ పీ సీ సీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి డీ సీ సీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పై ఫిర్యాదు చేసినట్లు  తెలిపారు.