ఆయుష్మాన్ భారత్‌తో ప్రజారోగ్యం బలోపేతం
- రాష్ట్రాలకు 32,961 కోట్ల పరిపాలనా అనుమతులు
- రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రతాప్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 32,961.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
రాజ్యసభలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మంగళవారం బీబీనగర్ ఎయిమ్స్ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రతాప్ రావు సమాధానమిచ్చారు. ఈ నిధుల ద్వారా 11,001 భవన రహిత సబ్ హెల్త్ సెంటర్-ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
ప్రజారోగ్యం రాష్ట్ర అంశం కావడంతో పథకం అమలు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సకాలంలో పరిపాలనా అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడంతో పాటు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎయిమ్స్ బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు కీలక తృతీయస్థాయి వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన సంస్థగా పనిచేస్తోందని తెలిపారు.






