భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే రైతులకు తెలియజేసి వారి సహకారంతో పనులు చేపట్టాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి సర్వేయర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో భూములు కొలతల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్చార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమికి రీ-సర్వే పూర్తయిందని, రోజువారీగా ఎంత విస్తీర్ణంలో సర్వే నిర్వహిస్తున్నారని, ఎన్ని రోవర్ పరికరాలతో సర్వే చేపడుతున్నారని సర్వేయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి రీ-సర్వే ప్రక్రియ, పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం గ్రామంలో రెండు సర్వే బృందాలు రీ-సర్వే పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ, ప్రతి సర్వే బృందం రోజుకు కనీసం 75 ఎకరాల భూమిని రీ-సర్వే చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సర్వే ప్రారంభానికి ముందే కార్యాచరణ రూపొందించి, ఆయా ప్రాంతాల రైతులకు తేదీలు, సమయాలపై ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు.
రైతుల సమన్వయంతో పనిచేసి, సర్వే పనుల్లో నాణ్యతతో పాటు వేగం పెంచాలని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా రీ-సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో భూములు కొలతల శాఖ సహాయ సంచాలకులు నూర్ సింగ్, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, సర్వేయర్ సూరజ్ కుమార్, జీపీవో శ్రీకాంత్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.






