2,193 వాహనాల బహిరంగ వేలం
ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు
బంజారాహిల్స్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తమ ఆధీనంలో ఉన్న వాహనాల వేలంపాట నిర్వహణకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రకటనను ఇప్పటికే విడుదల చేసింది. ప్రకటన ప్రకారం సుమారు 2,193 వాహనాల వేలంపాటను నిర్వహించనుంది. కమిషనరేట్ పరిధిలో విభిన్న కేసుల్లో జప్తు చేసిన, అలాగే రోడ్లపై వదిలేసిన వివిధ రకాల వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004’ సెక్షన్ 7, ’హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్’ సెక్షన్ 40 ల ద్వారా లభించిన అధికారాల మేరకు ఈ వేలం ప్రక్రియను చేపట్టనుంది.
వేలంపాట వేసే వాహనాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, లేదా వాహన యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్లు ఉన్నవారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని పో లీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ భవనంలో ఉన్న సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వాహనాలను క్లెయిమ్ చేసుకునేం దుకు ప్రకటన విడుదలైన తేదీ నుంచి ఆరు నెలల వ్యవధి ఉంటుందని తెలిపారు. గడువు ముగిశాక వచ్చే దరఖాస్తులను పరిశీలించబోమని, ఆ వాహనాలన్నింటినీ బహిరంగ వేలంలో విక్రయిస్తామని స్పష్టం చేశారు.
వాహనాల వివరాల కోసం
వేలంపాటకు సిద్ధంగా ఉన్న వాహనాల వివరాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు అవకాశం కల్పించారు. అంబర్ పేట పోలీసు ఆసుపత్రి వెనుక ఉన్న ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోలీస్ గ్రౌండ్స్ లోని ఆక్షన్ టీం వద్ద వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. వారిని నేరుగా కలిసి కూడా సమాచారం పొందవచ్చన్నారు. ఆన్లైన్ సమాచారం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ అధి కారిక వెబ్ సైట్ పరిశీలించవచ్చని వెల్లడించారు. ఆన్లైన్‌లో వాహనాల పూర్తి జాబితా ను ఉంచామని అధికారులు తెలిపారు.






