కుడాపై దాస్యం వినయ్ భాస్కర్ వి అసత్యపు ఆరోపణలు
- కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి శనివారం డిసిసి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుడా భూములపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడిన మాటలు అబద్ధమని, దమ్ముంటే కుడా భూములను గజం రూ.75 వేలకు ఆయనే కొనుక్కోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, కుడాపై చేసిన ఆరోపణలపై దాస్యం వినయ్ భాస్కర్ నేరుగా చర్చకు రావాలని, తాము అధికారంలోకి వచ్చాక కూడాకు 225 ఎకరాల భూములను ఇప్పించి, సంస్థకు ఏకంగా రూ. 500 కోట్ల ఆదాయం చూపించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, తమ నాయకత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కేటీఆర్ ఆదేశాల మేరకే గత ప్రభుత్వ హయాంలో కుడా నిధుల్లో రూ. 45 కోట్ల భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
ఏషియన్ మాల్ పక్కన, శాయంపేట, దీనదయాళ్ నగర్, రెడ్డిపురంలో విలువైన కుడా భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడిందని గుర్తు చేశారు. నగర అభివృద్ధి కోసం తాము ఇన్వెస్టర్లను తీసుకువస్తుంటే, బీఆర్ఎస్ నేతలు వారిని బెదిరిస్తూ హనుమకొండ ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలో జరిగిన కాంట్రాక్టర్ అవినీతిపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని తెలిపారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీని ఎలాంటి రాజకీయాలు లేకుండా, పార్టీలకు అతీతంగా అర్హులకు అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వినయ్ భాస్కర్ వైఫల్యాల వల్లే ప్రజలు ఆయన్ను ఓడించారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.






