20-02-2026 06:20:29 PM
పౌరాగడ్ పీఠాధిపతి ధర్మ గురు బాబు సింగ్ మహారాజ్..
తాండూరు,(విజయక్రాంతి): శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ ఆశయాలు నెరవేర్చేందుకు ఆయన సూచించిన ప్రవచనాలు పాటిస్తూ... ఆయన అడుగుజాడల్లో నడుస్తూ...ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని మహారాష్ట్ర బంజారాల కాశిగా పిలవబడే పౌరదేవి గడ్ పీఠాధిపతి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ధర్మ గురు శ్రీ బాబు సింగ్ మహారాజ్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా యాడి బాపూగడ్ దేవస్థానం ధర్మకర్తలు, జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్, శాంతాదేవిల ఆధ్వర్యంలో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 316వ అవతార దినోత్సవంలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో ఉన్న సేవాలాల్, మరెమ్మ అమ్మవారికి పిండి వంటలతో తయారుచేసిన భోగ్ నైవేద్యం భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా బాబు సింగ్ మహారాజ్ మాట్లాడుతూ... బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ బంజారాల చైతన్యం కోసం ఆ కాలంలోనే తండా తండాకు కాలినడకని తిరిగారని ఆయన అడుగుజాడల్లో యువత నడుస్తూ ఆధ్యాత్మికత, భక్తి భావంతో నడుస్తూ ఐక్యంగా ఉండాలని అన్నారు.
పౌరాగాడ్ లో విశాలమైన మందిర నిర్మాణం కోసం సకల సౌకర్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.700 కోట్లు మంజూరు చేశారని అందుకుగాను పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. సురేందర్ నాయక్ మహారాజ్ మాట్లాడుతూ... సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు అంటూ కొంతమంది ఎక్కడపడితే అక్కడ కేకులు కట్ చేయడం సరికాదని అయినా బంజారాల ఆరాధ్యుడని సాంప్రదాయ బద్దoగా దేవాలయాల్లోనే భోగి నైవేద్యం సమర్పించాలని కోరారు. గత 20 ఏళ్లుగా యాడి బాపూ గడ్ లో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బంజారాల సుఖశాంతుల జీవనం కోసం శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకుగాను ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా ప్రతి తండాలో సేవాలాల్, మరియమ్మ ఆలయాలు నిర్మించాలని, నియోజక వర్గ స్థాయిలో పది ఎకరాల స్థలంలో విశాలమైన ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బొమ్మలరామారం మాజీ సర్పంచ్ పాండు నాయక్ వివిధ గ్రామాల బంజారాలు యువతీ, యువకులు, భక్తులు ,ప్రజలు భారీగా పాల్గొన్నారు