బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్ర వారం మంచిర్యాల ఐబి చౌరస్తా నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో మేం అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతం పెంచి వాటిని ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తామని విస్మరించిందన్నారు.
అంతే కాకుండా మొదటి అసెంబ్లీ సెషన్ నే చట్టబద్ధతతో కూడిన మహాత్మ జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచి కత్తులేని రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తామని, బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, అలాగే రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, అన్ని జిల్లా కేంద్రాలలో రూ. 50 కోట్లతో బీసీ భవనాలు, అందులోనే లైబ్రరీ స్టడీ సర్కిల్, ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని,
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని ఇలా అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలవుతున్న బీసీ డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రజావాణి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్ వర్మ, జిల్లా నాయకులు పడాల శివతేజ, భీమిని రమేష్, మహమ్మద్ లతీఫ్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సధానందం, రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తంగళ్ళపెల్లి బాపు, బీసీ నాయకులు సూరయ్య, వేముల కిరణ్, కీర్తి బిక్షపతి, న్యాయవాది కొట్టె నటేశ్వర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.






