18 April, 2026 | 3:05 AM

ఆదివాసీ గిరిజనుల్లో వరకట్న నిషేధం

18-04-2026 12:00 AM

అమ్మాయిల పెళ్లిళ్లకు ఇంటింటి నుంచి కట్నం

ఉట్నూర్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లి చేయాలంటే  ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు, కొలం గిరిజనులు మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులపై  భారం పడకుండా గ్రామ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆదివాసి గిరిజన తెగలలలో తొలినుంచి ఆచారంగా వస్తున్న  సాంప్రదాయ పెళ్లిలు నిర్వహించేవారు. కానీ కం ప్యూటర్ యుగంలో ఆదివాసి గిరిజనులు  వరకట్నం వైపు మొగ్గు చూపుతున్నారు. వరకట్నం కోసం గిరిజనులు అప్పుల పాలైన విషయాన్ని గోండు గూడ ల పెద్దలు గమనించారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు  అప్పుల పాలు కాకుండా దశాబ్దాలుగా వచ్చే సాంప్రదాయ పెళ్లిలో నిర్వహించాలని నిర్ణయించా రు. ఆడపిల్ల పెండ్లి కోసం  గ్రామాల్లో వరకట్నం నిషేధిస్తూ ప్రత్యేక తీర్మానాలు చేశారు. ఆడపిల్ల పెళ్లికి  అవసరమైన ఖర్చులు నిమి త్తం ఆదివాసీల ఇంటింటి నుంచి కట్నం రూ పంలో  రూ. 200 నుండి రూ. 500 వరకు ప్రతి కుటుంబం నుండి సేకరించి ఆడపిల్లలకు పెళ్లి ఖర్చుల కింద అందజేస్తున్నారు.

దీంతో ఈ ఏడాది ప్రతి గూడెం లో ఆడపిల్లల పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లల పెండ్లిలను ఆదివాసి గోండు, కొలం గిరిజనులు వారి సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. వరకట్నం లేకుండా ఆడపిల్ల పెళ్లిలు చేయడంలో ఆదివాసి గిరిజను లు ఆదర్శంగా నిలుస్తున్నారు.