7 March, 2026 | 9:48 AM

బొగ్గు లారీల పార్కింగ్‌తో అవస్థలు

06-03-2026 12:00 AM

సత్తుపల్లి, మార్చి5 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బొగ్గు లారీలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో లారీలు రోడ్లపైనే  నిలుపుతున్నారు. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుం ది. ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై  బొగ్గు లారీల నిర్లక్ష్య పార్కింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.

ముఖ్యంగా మూల మలుపు వద్దనే లారీలు రోడ్డు ప్రక్కన నిలిపివేయడం వల్ల  ప్రమాదాల ఆస్కారం అధికంగా ఉంది. అనునిత్యం భారీ వాహనాల రద్దీ ఉండే ఈ మార్గంలో లారీలు గంటల తరబడి పార్కింగ్ చేయడం ఏమిటని స్థానికులు వాపోతున్నారు.

ఇరుకు రోడ్డు కావడం వల్ల...

రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు,ఒకవైపు లారీలు నిలిచిపోతే, ప్రయాణించే వాహనాలకు సరిపడ స్థలం లేకపోవడం గమనార్హం. స్కూల్ బస్సులు, అంబులెన్స్లు, ద్విచక్ర వాహనదారులు ఈ పరిస్థితి  తీవ్రతను ఎదుర్కొంటున్నారు.స్థానిక వ్యాపారులు, నివాసితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం, మూల మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, నిర్దిష్ట సమయాల్లో లారీ రాకపోకలను నియంత్రించడం వంటి చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు.ఈ రహదారి ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు అనుసంధానించే కీలక మార్గం కావడంతో రోజువారీ వాహన రద్దీ అధికంగా ఉంటుంది.

ఇలాంటి ప్రాధాన్యమైన మార్గంలో రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితులను నివారించేందుకు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా అధికారులు స్పందించి, రహదారి భద్రతను పరిరక్షించే చర్యలు చేపడితే ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.