calender_icon.png 20 February, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలకవర్గానికి సమస్యల స్వాగతం

20-02-2026 01:59:08 AM

ప్రమాణ స్వీకారం ముగిసింది.. అసలు సవాల్ మొదలైంది...

చైర్మన్‌గా శాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్పర్సన్‌గా జూలకంటి శ్వేత బాధ్యతల స్వీకారం

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): అట్టహాసంగా ప్రమాణ స్వీకారాలు.. పూలమాలల అభినందనలు.. బాజాభజంత్రీల కోలాహలం.. ఇదీ శంకర్పల్లి మున్సిపాలిటీలో ఇటీవల కనిపించిన దృశ్యం. అయితే, ఆ సంబరాలు ముగియకముందే నూతన పాలకవర్గానికి చేదు నిజాలు ఎదురవుతున్నాయి. ఓట్ల వేటలో ఇచ్చిన ‘హామీల మూటలు’ ఇప్పుడు బాధ్యతల భారమై కౌన్సిలర్లను వెంటాడుతున్నాయి.

గడప గడపనా ‘ప్రశ్నల వర్షం’.. నేతలకు తప్పని నిలదీతలు. గెలిచిన ఆనందంలో వార్డుల్లో పర్యటిస్తున్న కౌన్సిలర్లకు ప్రజల నుంచి ‘మర్యాదపూర్వక’ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘పదేళ్ల వనవాసం చాలు.. ఇకనైనా మా సమస్యలు తీరేనా?‘ అంటూ జనం అడుగుతున్న ప్రశ్నలకు పాలకవర్గం నీళ్లు నమలాల్సి వస్తోంది.

డ్రైనేజీ ‘నరకం’.. రోడ్లపై ‘బురద’మయం..

వర్షం వస్తే చాలు, శంకర్పల్లి వీధులు మురుగు కాలువలను తలపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అంటురోగాల భయంతో వణుకుతున్నారు. కనీసం నడవడానికి వీలులేని సి.సి. రోడ్ల దుస్థితిపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. మృత్యుపాశాలుగా మారిన  ఇళ్ల మధ్యలో వేలాడుతున్న హైటెన్షన్ తీగలు, రోడ్ల పక్కనే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తాయో తెలియనిఅయోమయ పరిస్థితి. వీటిని వెంటనే తొలగించాలని జనం అల్టిమేటం జారీ చేస్తున్నారు.

పథకాల ‘సెగ’.. పెన్షన్ల ‘గోస’...

ఎన్నికల ప్రచారంలో నాయకులు గుప్పించిన హామీలే ఇప్పుడు వారికి సంకటంగా మారాయి. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులు, కొత్త పాలకవర్గం రాగానే తమ పనులు అయిపోవాలని పట్టుబడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించాం.. ఇప్పుడు మాకు పెన్షన్లు ఇప్పించండి. లేదంటే మీ హామీలు గాలిలో దీపాలేనా?‘ అని వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకవర్గం ముందున్న ‘పంచరత్న’ సవాళ్లు

ప్రజలు కోరుతున్న ఐదు ప్రధాన అంశాలు ఇప్పుడు కొత్త టీమ్ కి టాస్క్ లా మారాయి.పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు.వార్డు వార్డుకూ సి.సి. రోడ్లు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ.ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సాధన, మెరుగైన ఆసుపత్రి సౌకర్యాలు.ప్రతి వీధిలో ఎల్‌ఈడీ వెలుగులు, పార్కుల అభివృద్ధి.

స్వచ్ఛ శంకర్పల్లి, చెత్త సేకరణ ఆటోల పెంపు, పారిశుధ్య నిర్వహణ పలు హామీలు. 

శంకర్పల్లి మున్సిపల్ పీఠం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. మాటల గారడీని పక్కనపెట్టి, చేతల్లో అభివృద్ధి చూపకపోతే ప్రజల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చైర్మన్ ప్రవీణ్ కుమార్ పాలకవర్గం బృందం ఈ ’సవాల్’ ని ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాలి.

మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

 మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. పట్టణంలో ప్రధాన సమస్యలైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, మరియు వీధి దీపాల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన సాత విజయలక్ష్మి హయాంలో అనేక సమస్యలను పరిష్కరించామని, మిగిలిపోయిన పనులను ప్రస్తుతం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

ప్రభుత్వాలు మారి నా, తమ కుటుంబం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా మని ఈ సందర్భంగాఆయన వెల్లడించారు.