నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ
- ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు ధర్మపురి సంజయ్
బోధన్,(విజయక్రాంతి): నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వేడుకలను ఈసారి కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. మహిళలు బోనాలు ఎత్తుకొని, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల నడుమ గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ఆహ్వానించిన గ్రామస్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నాళేశ్వర్ గ్రామ ప్రజలందరిపై ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.
సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ, గత రెండేళ్లుగా నాళేశ్వర్ గ్రామంలో ఆషాఢ మాసంలో మహాలక్ష్మి బోనాల పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా మున్నూరు కాపు సంఘ భవనం నుంచి గ్రామాభివృద్ధి కమిటీ భవనం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించామని చెప్పారు. వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు, కమిటీ సభ్యులు సురేష్, రాజేశ్వర్, బోజరాం, గంగాధర్, మున్నూరు కాపు సంఘ సభ్యులు సుదర్శన్, శ్రీకాంత్, పోశెట్టి, గణేష్, బోజన్న, శేఖర్తో పాటు గ్రామస్థులు దేవన్న, ప్రవీణ్, నర్సింగ్ రావు, కిషన్, సంజీవ్, భూమయ్య, రమేష్ తదితరులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.






