తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత
* ప్రీ–ప్రైమరీ ప్రారంభోత్సవంలో ఫొటోగ్రాఫర్లుగా మారిన చిన్నారులు
* తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు బయటే
* పట్టించుకోని హెచ్‌ఎం, ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు
* విద్యా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న తల్లిదండ్రులు
అచ్చంపేట,(విజయక్రాంతి): పదర మండల కేంద్రంలోని గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రీ–ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి మండల విద్యాధికారి (ఎంఈఓ) రామ్‌రెడ్డి హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారులకు పాఠశాల వాతావరణంపై అవగాహన కల్పించడం, వారికి ఆటపాటల ద్వారా విద్యాబోధన ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
కానీ పదర పాఠశాలలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పాఠశాలలో చదువుతున్న చిన్నారి విద్యార్థులే ఫొటోలు తీస్తూ కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రీ–ప్రైమరీ విద్యార్థులు తరగతి గదుల్లో ఉండి విద్యా కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన సమయంలో, వారికి ఫొటోలు తీసే బాధ్యతలు అప్పగించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వేళ, పాఠశాల యాజమాన్యం విద్యార్థులను విద్యా కార్యక్రమాలకు దూరంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థుల వయస్సు, భద్రత, వారి మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారం మొత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలోనే జరిగినప్పటికీ, ఎవరూ జోక్యం చేసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఏం చేస్తున్నారు, వారు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అనే విషయాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటం, ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రీ–ప్రైమరీ విద్య చిన్నారుల భవిష్యత్తుకు పునాది వంటిదని, ఆ దశలోనే విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. పదర పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఎంఈఓను వివరణ కోరగా విద్యార్థులు ఫోటో తీస్తున్న విషయాన్ని గమనించలేదని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావడం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






