ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది
కొత్తపల్లి,(విజయక్రాంతి): ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుందని శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ అన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ఈ ఆర్పీ 9 – ఏ స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్” మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యాపార, ఆర్థిక వ్యవస్థలో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.
విద్యార్థులు పాఠ్యాంశ పరిజ్ఞానంతో పాటు ట్యాలీ, జీఎస్టీ, పేరోల్, ఇన్వెంటరీ తదితర ఆర్థిక నివేదికల తయారీ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఇలాంటి శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయన్నారు. కార్యశాలలో పాల్గొన్న 60 మంది విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమ కన్వీనర్, వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ డి. హరికాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్యశాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ కె. సాయిశరణ్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. రమాకాంత్ మాట్లాడుతూ, ఆర్ట్స్, లా కళాశాల ప్రిన్సిపాల్ డా.పద్మావతి, కో-కన్వీనర్లు డా. కె. తిరుపతి, డా. బి. నరేష్, డా. బి. పరశురాములు, అధ్యాపకులు,డా. క్రిష్ణ కుమార్, డా.మనోజ్ కుమార్, సావిత్రి, తదితరులు తెలిపారు.






